పిల్లలకు కన్న తల్లిదండ్రులే మొదటి గురువులు, మొదటి స్నేహితులు, మదటి మార్గదర్శులు. తొలిదశలో తల్లిదండ్రుల నుండే అన్నీ నేర్చుకుంటాం, వారి కోణం నుండే ప్రపంచాన్ని చూస్తాం. వయసుడిగిన తరువాత వారు మనల్ని వదలి పరలోకానికేగినపుడు కలిగే బాధ వర్ణనాతీతం. కానీ, కన్నవారిని కర్కశంగా తమ చేతులతోనే మట్టుబెట్టే సంతానం కూడా వుంటారు. కాకపోతే, చాలా సందర్భాల్లో కొడుకులు క్షణికావేశంలోనో, పక్కా ప్లాన్ తోనో అనంత లోకాలకు పంపే కొడుకులను చూస్తూంటాం గానీ, ఇంతటి దారుణానికి ఒడిగట్టే కూతుళ్లు మాత్రం బహుశా వుండకపోవచ్చు. అలాంటి దారుణాతి దారుణం ఒకటి వెలుగులోకి వచ్చింది.
తన ప్రేమను అంగీకరించని తండ్రిని ప్రియుడితో కలిసి హత్య చేసి అడ్డు తొలగించుకోవాలని చూసిందో కూతురు. ఆమెకు తల్లి కూడా సహకరించింది. అనుకున్నట్టే ప్రియుడిని పిలిపించి హత్యచేశారు. ఆపై ‘దృశ్యం’ సినిమాలోలా తల్లీకూతుళ్లు ఇద్దరూ ఒకేరకమైన సమాధానాలు ఇస్తుండడంతో అనుమానం వచ్చిన పోలీసులు వారి ఫోన్ కాల్స్‌ను పరిశీలించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కర్ణాటకలోని బెళగావిలో జరిగిందీ ఘటన. ఆ వివరాలేంటో చూద్దాం. పోలీసుల చెప్తున్నదేంటంటే నగరానికి చెందిన యాభై ఏడేళ్ల సుధీర్ కాంబళె, రోహిణి భార్యాభర్తలు. వీరికి స్నేహ అనే కుమార్తె ఉంది. గతంలో దుబాయ్‌లో పనిచేసిన సుధీర్ కరోనా తర్వాత నగరానికి చేరుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభించారు. పూణెలో హోటల్ మేనేజ్‌మెంట్ చదువుతున్న సమయంలో స్నేహకు అక్షయ్ విఠకర్ అనే యువకుడు పరిచయమయ్యాడు. అది క్రమంగా ప్రేమగా మారింది. కుమార్తె ప్రేమ విషయాన్ని గుర్తించిన తండ్రి సుధీర్ ఆమెను మందలించాడు.
దీంతో తండ్రిని తమ ప్రేమకు అడ్డుగా భావించి ఆ అడ్డును తొలగించుకోవాలనుకుంది. విషయం తల్లి రోహిణికి చెప్పగా ఆమె కూడా సరేనంది. దీంతో ప్రియుడితో కలిసి తండ్రి హత్యకు స్నేహ ప్లాన్ చేసింది. అందులో భాగంగా ఈ నెల 15వ తేదీన అక్షయ్‌ను నగరానికి రప్పించి ఓ లాడ్జీలో ఉంచింది. 16వ తేదీ రాత్రి తండ్రి పైఅంతస్తులో నిద్రించగా 17న తెల్లవారుజామున తల్లీ కుమార్తెలు అక్షయ్‌ను ఇంటికి పిలిపించారు. తల్లీ కూతుళ్లు ఇద్దరూ సుధీర్ కాళ్లూ, చేతులను పట్టుకోగా అక్షయ్ కత్తితో ఇష్టానుసారంగా పొడిచి చంపేశాడు. అనంతరం అక్షయ్ పూణె వెళ్లిపోయాడు. ఆ తర్వాత తన భర్త హత్యకు గురయ్యాడంటూ రోహిణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు తల్లీ కుమార్తెను ప్రశ్నించారు.
విచారణలో వారిద్దరూ ఒకే రకమైన సమాధానాలు చెప్తూండడంతో అనుమానించిన పోలీసులు, వారి ఫోన్ కాల్స్‌ను పరిశీలించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో గట్టిగా గద్దించగా హత్య చేసింది తామేనని అంగీకరించారు. ఇద్దరూ ఒకే రకంగా సమాధానాలు చెప్పేందుకు దృశ్యం సినిమాను పలుమార్లు చూసినట్టు చెప్పారు. నిందితులు రోహిణి, స్నేహ, అక్షయ్‌లు ముగ్గురినీ అరెస్ట్ చేసిన పోలీసులు కటకటాల వెనక్కి పంపారు. ఏదేమైనా అలాంటి భార్య, కూతురు వున్నందుకు సుధీర్ కాంబళె మాత్రం నిజంగా దురదృష్టవంతుడనే చెప్పాలి.