సాయిధన్సిక, తేజ్ కూరపాటి, అభినవ్ మేడిశెట్టి, కె.వి. ధీరజ్, నవకాంత్, చమ్మక్ చంద్ర ప్రధాన తారాగణంగా నటించిన చిత్రం `షికారు` శ్రీసత్యసాయిబాబాగారి ఆశీస్సులతో నాగేశ్వరి (పద్మ) సమర్పణలో పి.ఎస్.ఆర్. కుమార్ (బాబ్జీ, వైజాగ్) నిర్మాతగా శ్రీసాయి లక్ష్మీ క్రియేషన్స్ బేనర్‌మీద హరి కొలగాని దర్శకత్వంలో రూపొందింది. (యాన్ అన్‌లిమిటెడ్ ఫన్ రైడ్) అనేది ట్యాగ్‌లైన్. శేఖర్ చంద్ర సంగీతం సమకూర్చిన ఈ చిత్రంలోని పాటలు యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించాయి. ఇటీవలే చిత్ర యూనిట్ వైజాగ్ నుంచి నెల్లూరువరకు రోడ్‌ట్రిప్ నిర్వహించింది. ప్రతిచోట యూత్ బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా ఆ విశేషాలను, చిత్ర విడుదల తేదీని తెలియజేస్తూ, చిత్ర యూనిట్ ఆదివారంనాడు మీడియా సమావేశం ఏర్పాటు చేసింది.
సాయిధన్నిక మాట్లాడుతూ… అందరి సమిష్టి కృషితో మన సినిమాగా పనిచేశాం. షికారు చిత్రానికి మొదట శ్రీకారం చుట్టింది బెక్కెం వేణుగోపాల్‌గారు. నా పేరు దర్శకుడు హరి సూచిస్తే, అందుకు సపోర్ట్ చేసింది ఆయనే. మంచి కథతో షికారు ద్వారా తెలుగువారి ముందుకు వస్తున్నా. మొదట తమిళ అమ్మాయికి తెలుగువారి సపోర్ట్ ఎలా వుంటుందనే సందేహం వుండేది. కానీ ఇక్కడకు వచ్చాక అంతా పోయింది. దర్శకుడు నాకు అందమైన పాత్ర ఇచ్చారు. ఆయనకు సినిమాపై మంచి క్లారిటీ వుంది. నిర్మాత బాబ్జీగారు కుటుంబసభ్యుల్లా అందరినీ చూసుకున్నారు. ప్రచారంలో భాగంగా వైజాగ్ నుంచి నెల్లూరు వరకు రోడ్ ట్రిప్‌లో ఎంతో సంతోషం కలిగింది. శేఖర్ చంద్ర బాణీలు బాగా పాపులర్ అయ్యాయి. `ఫ్రెండ్ తోడు వుండగా` పాట కాలేజీలో యూత్‌కు బాగా చేరింది. కరణ్ సంభాషణలు, శ్యామ్ ఫొటోగ్రఫీ హైలైట్‌గా నిలుస్తాయి. ధీరజ్, నవకాంత్ ,అభినవ్, తేజ, గాయత్రి ఇలా అందరూ మంచి పాత్రలు చేశారు. జులై1 సినిమాను చూడండి అని తెలిపారు.