Superstar Krishna Old Movies, Kodukulu Kodallu Movie, Tollywood Movies, Telugu Cinema, Film News, Telugu World Now,
FILM NEWS: “సూపర్ స్టార్ కృష్ణ” గారి షూటింగ్ ఆగిపోయిన సినిమా ఏంటో తెలుసా ?
సూపర్ స్టార్ కృష్ణ అనగానే బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఆయన చేసిన ప్రయోగాలు మనకు గుర్తొస్తాయి. అయితే, కేవలం ప్రయోగాలు, విజయాలు మాత్రమే గాక, తన సినిమాలకు పనిచేసే ప్రతివారినీ ఆదరించే గొప్ప మనసుతో సిసలైన సూపర్ స్టార్ గా అందరి మనసులకూ నచ్చారు కృష్ణ. నటుడిగా, దర్శక నిర్మాతగానే గాక, స్క్రీన్-ప్లే బాధ్యతలను సైతం నిర్వహించి ‘సింహాసనం’ చిత్రంతో తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్న విశేషాన్ని మనం ఎప్పటికీ మరువలేం…!
నిజానికి ఇంజినీరింగ్ చేయాలనుకున్న ఆయన, కాలేజీలో సీటు రాకపోవడం, నాటకాలు, సినిమాలపై వున్న ఆసక్తివల్ల నటుడిగా మారారు. అసలు పేరు శివరామ కృష్ణమూర్తి కాగా, దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు ఆయన పేరును కృష్ణగా మార్చారు. సూపర్ స్టార్ కృష్ణ ఇండస్ట్రీకి రాకముందు నుండీ అభిమాన నటుడు ఎన్.టి.ఆర్. ఆయన అభిమాన చిత్రం ‘పాతాళ భైరవి’. కృష్ణగారి తొలిచిత్రం ‘తేనె మనసులు’ అనే విషయం అందరికీ తెలిసిందే…! అయితే, అంతకు ముందే కొన్ని సినిమాలలో చిన్న చిన్న పాత్రలు వేశారు. రోజుకి షిఫ్టులు పనిచేస్తూ ప్రభంజనంగా ముందుకు సాగారు సూపర్ స్టార్. 1969లో ఏకంగా ఆయన నటించిన 19 సినిమాలు రిలీజ్ అవడం తిరుగులేని రికార్డు.
తెలుగు ప్రేక్షకులకు కౌబాయ్ నీ, జేమ్స్ బాండ్ నీ పరిచయం చేసిన ఘనత కూడా సూపర్ స్టార్ కృష్ణగారికే దక్కింది. అయితే, ఆయన సినీ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న రోజుల్లో ఎల్.వి.ప్రసాద్ గారు “కొడుకులు – కోడళ్లు” అనే చిత్రాన్ని ప్రారంభించి అందులో ఒక పాత్రకు కృష్ణగారిని ఎంపిక చేశారుట…! కానీ, అనుకోని పరిస్థితుల్లో ఆ సినిమా చిత్రీకరణ కాస్తా ఆగిపోయింది. ఆ తర్వాత ఆయన కెరీర్ అంతా అనితర సాధ్యమైన ప్రయోగాలతో, సూపర్ హిట్ సినిమాలతో సాగిపోయింది.