పెయింట్స్ రంగంలో ఉన్న హైదరాబాద్ కంపెనీ టెక్నో పెయింట్స్ బ్రాండ్ అంబాసిడర్ గా సినీనటుడు మహేశ్ బాబు నియమితులయ్యారు. ఈ మేరకు టెలివిజన్ కమర్షియల్ యాడ్ ను (టీవీసీ) నమ్రత మహేశ్ ఘట్టమనేని, రాజ్య సభ ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, మేఘా ఇంజనీరింగ్, ఇన్ప్రా స్ట్రక్చర్స్ డైరెక్టర్ బి. శ్రీనివాస్ రెడ్డి ఆవిష్కరించారు. టీఎస్ఈడబ్ల్యుఐడీసీ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి చేతుల మీదుగా స్టిల్స్ లాంఛ్ చేశారు. హైదరాబాద్ మాదాపూర్లోని ఎన్-కన్వెన్షన్లో బుధవారం సాయంత్రం అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో క్రెడాయ్, నరెడ్కో ప్రతినిధులు, నిర్మాణ రంగ సంస్థల ప్రమోటర్లు, టెక్నోపెయింట్స్ సిబ్బంది హాజరయ్యారు.
ఈ సందర్భంగా టెక్నోపెయింట్స్ ను ప్రమోట్ చేస్తున్న ఫార్చూన్ గ్రూప్ ఫౌండర్ ఆకూరి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ‘22 ఏళ్ల సంస్థ ప్రస్థానంలో నాణ్యమైన రంగులు, పెయింట్స్ సర్వీస్ తో బిజినెస్ టు బిజినెస్ (బీటూబీ) విభాగంలో విజయవంతం అయ్యాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా 1,000కి పైగా ప్రాజెక్టులు పూర్తిచేశాం. యూత్ ఐకాన్ గా సూపర్ స్టార్ మహేశ్ బాబుకు ఉన్న బ్రాండ్ ఇమేజ్ కంపెనీ విస్తరణకు దోహదం చేస్తుంది. భారత పెయింట్స్ రిటైల్ రంగంలో సుస్థిర స్థానం సంపాదించాలన్న మా లక్ష్యం నెరవేరుతుందనే ధీమా ఉంది’అని తెలిపారు.
25 శాతం వాటా లక్ష్యం..
తెలుగు రాష్ట్రాల్లో రూ.12,000 కోట్ల పెయింట్స్ పరిశ్రమలో 25 శాతం వాటాను లక్ష్యంగా చేసుకున్నట్టు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ‘12–18 నెలల్లో ఈ లక్ష్యాన్ని చేరుకుంటాం. 5,000 టచ్ పాయింట్స్ లో మా ఉత్పత్తులను చేరుస్తాం. ఇప్పటికే 2,000 షేడ్స్ లో రంగులు తయారుచేస్తున్నాం. మరో 1,000 షేడ్స్ కొత్తగా జోడించాం. వినియోగదారు కోరుకున్న రంగును వెంటనే అందించేందుకు కలర్ బ్యాంక్స్ ని పరిచయంచేస్తున్నాం. ఎంఎన్సీలు మాత్రమే కలర్ బ్యాంక్స్ లను ఉపయోగిస్తున్నాయి. వుడ్ అధెసివ్, టైల్ లైప్నర్, వుడ్పాలిష్, వాటర్ ప్రూఫింగ్ కాంపౌండ్స్ వంటి ఉత్పత్తులను కొత్తగా ప్రవేశపెట్టాం’అని వివరించారు.
వేగంగా చేరేందుకు..
‘సమయానికి కస్టమర్లకు పెయింట్లను చేర్చేందుకు 25 డిపోలను నెలకొల్పాం. పటాన్ ఛెరులో 50,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో సెంట్రల్ వేర్ హౌజ్ ను ఏర్పాటు చేశాం. కంపెనీ వార్షిక తయారీ సామర్థ్యం ప్రస్తుతం ఒక లక్ష మెట్రిక్ టన్నులు ఉంది. వచ్చే ఏడాదిలోగా ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు, విశాపట్నంతో పాటు ఒరిస్సాలో నెలకొల్పుతున్న ప్లాంట్లు జతకూడ నున్నాయి. దీంతో సామర్థ్యం 2.5 లక్షల మెట్రిక్టన్నులకు చేరుతుందని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
ప్రభుత్వం నుంచి భారీ ప్రాజెక్టు..
ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం నుంచి మన ఊరు – మన బడి, మన బస్తీ – మన బడి కార్యక్రమంలో భాగంగా 26,065 పాఠశాలలకు రంగులు వేసే ప్రతిష్టాత్మక ప్రాజెక్టును టెక్నో పెయింట్స్ చేపట్టింది. రియల్టీ రంగంలో గత ఆర్థిక సంవత్సరంలో 80కి పైగా ప్రాజెక్టులు పూర్తి అయ్యాయి. ప్రస్తుతం 140 ప్రాజెక్టులు చేతిలో ఉన్నాయి. 250 మంది ఉద్యోగులు ఉన్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా 4,000 మంది పెయింటర్లు కంపెనీ ప్రాజెక్టుల్లో నిమగ్నమయ్యారు.
సాల్వెంట్ ఆధారిత ఎనామెల్ పెయింట్ల తయారీని కంపెనీ గత ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించింది. ఇటలీకి చెందిన రియాల్ టో కలర్స్ భాగస్వామ్యంతో స్పెషల్ టెక్స్చర్స్, ఫినిషెస్ ను సైతం ఉత్పత్తి చేస్తోంది. 2022–23 లో కంపెనీ 100 శాతం వృద్ధి సాధించింది.