ప్రజలకు డిజిటల్ సేవలు అందించటంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్రసింగ్ ప్రశంసించారు. ఈ-గవర్నెన్స్ ద్వారా సుపరిపాలన అందించడంలో తెలంగాణ వినియోగిస్తున్న సాంకేతికత అద్భుతంగా ఉన్నదని కొనియాడారు. హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో రెండు రోజులపాటు నిర్వహిస్తున్న ‘24వ నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఈ-గవర్నెన్స్’ను శుక్రవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. పరిశ్రమలు, వాణిజ్యం, సుపరిపాలనతో పాటు సామాజిక సంక్షేమం, అభివృద్ధి, టెక్నాలజీ ఉపయోగంలో మిగిలిన రాష్ర్టాలకంటే తెలంగాణ ముందున్నదని తెలిపారు. మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి మేరకు రాష్ట్రంలో ఏరోస్పేస్ రంగం అభివృద్ధికి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఇన్‌స్పేస్ సెంటర్ ఏర్పాటు చేయాల్సిన నగరాల జాబితాలో హైదరాబాద్ వెయిటింగ్ లిస్టులో ఉన్నదని, దీనిపై స్పష్టమైన ప్రకటన చేసేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు.
స్టార్టప్‌లకు కేరాఫ్ తెలంగాణ: స్టార్టప్‌లకు తెలంగాణ కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిందని జితేంద్రసింగ్ కితాబిచ్చారు. తెలంగాణ ప్రభుత్వ కార్యక్రమాలు గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్-2021లో గొప్ప గుర్తింపు పొందాయని గుర్తుచేశారు. ఫిర్యాదుల పరిష్కారం కోసం రాష్ట్రంలో అమలుచేస్తున్న కార్యక్రమాలు ఉత్తమంగా ఉన్నాయని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ఈ-గవర్నెన్స్‌లో మనదేశం ప్రపంచస్థాయి ప్రమాణాలను అందుకోవడంలో తెలంగాణ కీలకపాత్ర పోషించాలని ఆకాంక్షించారు. దేశంలో డిజిటల్ విప్లవం మొదలైందని, ప్రపంచ డాటా పవర్ హౌస్‌గా భారత్ అవతరించిందని చెప్పారు.
ఐటీఐఆర్‌పై పునరాలోచించండి: కేటీఆర్ : బెంగళూరు, అహ్మదాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నట్టే, స్పేస్ రిసెర్చ్ రంగంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌లోనూ ‘సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఇన్‌స్పేస్ సెంటర్’ను ఏర్పాటుచేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమ శాఖల మంత్రి కే తారకరామారావు కేంద్రాన్ని కోరారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్లకు అదనంగా మరో రెండింటిని మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. 2012-13లో అప్పటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఐటీఐఆర్ ప్రాజెక్ట్‌ను మంజూరు చేస్తే, ఎన్డీయే అధికారంలోకి వచ్చాక దాన్ని వెనక్కి తీసుకొన్నదని అన్నారు. రాష్ట్రంలో 2013-14లో రూ.57వేల కోట్లు ఉన్న ఐటీ ఎగుమతులు ఇవాళ రూ.1.45 లక్షల కోట్లకు పెరిగాయని చెప్పారు. తెలంగాణకు ఐటీఐఆర్ కేటాయించడంపై పునరాలోచన చేయాలని కోరారు.ఈ- గవర్నెన్స్ సేవలు మంత్రి కేటీఆర్ మాటల్లో : • రాష్ట్రంలోని 4,500 మీసేవ కేంద్రాల ద్వారా రోజుకు లక్ష మందికి సేవలు అందాయి. 2014 నుంచి ఇప్పటి వరకు 21 కోట్ల సేవలు అందగా, రూ.29వేల కోట్ల లావాదేవీలు జరిగాయి. • టీ-వ్యాలెట్ ద్వారా 2017 నుంచి ఇప్పటి వరకు 2.6 కోట్ల లావాదేవీలు జరిగాయి. వీటి విలువ 14వేల కోట్లు. • టీ-యాప్ ఫోలియో ద్వారా రోజుకు 10 వేల అప్లికేషన్, సర్టిఫికెట్ సేవలు అందుతున్నాయి. టీ- యాప్ రోజుకు 270కి పైగా ప్రభుత్వ సేవలను అందిస్తున్నది. • రియల్ టైమ్ డిజిటల్ అథెంటికేషన్ ఆఫ్ ఐడెంటిటీ (ఆర్టీడీఏఐ)ని 2019లో ప్రారంభించి, పౌరులు ప్రభుత్వ • కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా మొబైల్ ద్వారా కావాల్సిన సేవలు పొందే వెసులుబాటు కల్పించాం. • పెన్షనర్స్ లైఫ్ సర్టిఫికెట్ త్రూ సెల్ఫీ(పీఎల్‌సీఎస్) ద్వారా ఇంటి నుంచే లైవ్ సర్టిఫికెట్, సెల్ఫీ అప్‌లోడ్ చేసే సేవలు అందిస్తున్నాం. 2019లో 30 వేల మంది, 2020లో 45 వేల మంది, 2021లో లక్ష మంది ఈ సేవలను వినియోగించుకొన్నారు. 2021లో • కేంద్ర ప్రభుత్వం సైతం ఇలాంటి యాప్‌ను అభివృద్ధి చేసింది. • ఫెస్ట్ యాప్ ద్వారా రవాణాశాఖకు సంబంధించి డ్రైవింగ్ లైసెన్స్, లెర్నింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ లాంటి 17 రకాల సేవలు అందిస్తున్నాం. దీని ద్వారా ఆదివారాలు, సెలవు రోజుల్లోనూ ప్రజలు సేవలను పొందుతున్నారు.