విద్యుత్తు పంపిణీలో తెలంగాణకు చెందిన ఎస్పీడీసీఎల్ జాతీయస్థాయిలో మొదటిస్థానంలో నిలిచింది. ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రకటించిన అవార్డుల్లో నాలుగు విభాగాల్లో మొదటి ర్యాంకుతోపాటు మరో అవార్డును దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (ఎస్పీడీసీఎల్) సొంతం చేసుకుంది. వీటితోపాటు ఓవరాల్‌గా మొదటి ర్యాంకుతో మొత్తంగా ఆరు ర్యాంకులు సాధించినట్టయింది. 15వ ఇండియా ఎనర్జీ సమ్మిట్‌లో భాగంగా విద్యుత్తు పంపిణీ, సంసరణలు, సమర్థత అంశాలపై వివిధ రాష్ట్రాల డిసం యాజమాన్యాలు, ప్రభుత్వ అధికారులతో ఆన్‌లైన్‌లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వివిధ క్యాటగిరీల్లో విద్యుత్తు పంపిణీ సంస్థలకు అవార్డులు ప్రదానం చేశారు. వివిధ విభాగాల్లో సమిష్టి ప్రతిభ కనబర్చిన టీఎస్‌ఎస్పీడీసీఎల్‌కు మొదటి ర్యాంకు, ఢిల్లీలోని బీఎస్‌ఈఎస్ రాజధాని పవర్ లిమిటెడ్‌కు రెండో ర్యాంకు, ఆంధ్రప్రదేశ్‌లోని ఏపీఎస్పీడీసీఎల్‌కు మూడో ర్యాంకు వచ్చాయి. టీఎస్‌ఎస్పీడీసీఎల్‌కు సామర్థ్య నిర్వహణ, వినియోగదారుల సేవ, నూతన సాంకేతిక పరిజ్ఞానం అమలు, పనితీరు సామర్థ్యం విభాగాల్లో మొదటి ర్యాంకులు, గ్రీన్ ఎనర్జీ విభాగంలో మూడో ర్యాంకు వచ్చాయి. దీంతో ఓవరాల్‌గా మొదటి ర్యాంకు టీఎస్‌ఎస్పీడీసీఎల్‌కు దక్కింది. రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న వివిధ రాష్ర్టాల ప్రతినిధులు తెలంగాణ ప్రభుత్వాన్ని, రాష్ట్ర విద్యుత్తు సంస్థలను అభినందించారు.
ఈ సమావేశంలో పాల్గొన్న ఎస్పీడీసీఎల్ సీఎండీ జీ రఘుమారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడ్డప్పుడు హైదరాబాద్ నగరంలో రోజుకు మూడునాలుగు గంటలు, పల్లెలు, పట్టణాల్లో ఆరు నుంచి ఎనిమిది గంటలపాటు విద్యుత్తు కోతలు ఉండేవని, దీనికి తోడు పరిశ్రమలకు వారానికి రెండు రోజుల పవర్ హాలిడేలు ఉండేవని గుర్తుచేశారు. అయితే సీఎం కేసీఆర్ దిశానిర్దేశంలో ఆరు నెలల్లోనే రాష్ట్రంలో విద్యుత్తు పంపిణీ వ్యవస్థ మారిపోయిందన్నారు. నాటినుంచి గృహ, వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు 24 గంటలు నిరంతరాయంగా విద్యుత్తును అందిస్తున్నామని చెప్పారు.ఈ విజయానికి కారణమైన సీఎం కేసీఆర్, విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, ఇంధనశాఖ కార్యదర్శి సునీల్‌శర్మ, అన్ని విధాలుగా దిశానిర్దేశం చేస్తున్నతెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఈవో గణేశ శ్రీనివాసన్, బీఎస్‌ఈఎస్ డైరెక్టర్, గ్రూప్ సీఈవో మల్ సిన్హా, పశ్చిమబెంగాల్ విద్యుత్తు శాఖ అదనపు చీఫ్ సెక్రటరీ సురేశ్‌కుమార్, ఎంఎస్‌ఈడీసీఎల్ సీఎండీ విజయ్ సింఘాల్, ఒడిశా ప్రిన్సిపల్ సెక్రటరీ నిహారి భికుంజ ధల్, ఐసీసీకి చెందిన అనిల్ రజ్దాన్ తదితరులు పాల్గొన్నారు.