వైద్యారోగ్య రంగంలో తెలంగాణ ప్రభుత్వం అత్యుత్తమ సేవలు అందిస్తున్నదని మరోసారి నిరూపితమైంది. కొవిడ్ మహమ్మారి విజృంభించిన వేళ ఆరోగ్య సూచీలో రాష్ట్రం మెరుగైన స్థానంలో నిలవడమే దీనికి తార్కాణం. దేశవ్యాప్తంగా 2020-21 సంవత్సరానికిగానూ నీతిఆయోగ్ నిర్వహించిన ఆరోగ్య సూచీ సర్వేలో పెద్ద రాష్ర్టాల విభాగంలో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. నీతిఆయోగ్, కేంద్ర ఆరోగ్యశాఖ, ప్రపంచ బ్యాంకు సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో వెలుగు చూసిన వాస్తవం ఇది. దీంతో సర్కారీ వైద్య సేవలపై రాష్ట్ర బీజేపీ నేతలు చేస్తున్నవి పసలేని ఆరోపణలని మరోసారి తేలిపోయింది.
కేంద్ర ప్రభుత్వ సహకారం లేకపోయినా రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సారథ్యంలో తెలంగాణ కొవిడ్‌ను సమర్థంగా ఎదుర్కొన్నది. గత ఏడాది ఇంక్రిమెంటల్ పనితీరులో ప్రథమ స్థానంలో, ఈ ఏడాది మొత్తం ఆరోగ్యపరంగా పనితీరులో తృతీయ స్థానంలో తెలంగాణ నిలిచింది. అయితే ఈ అధ్యయనం పూర్తయినప్పటికీ బీజేపీ పాలిత రాష్ర్టాల పనితీరు అధ్వాన్నంగా ఉండటంతో ఈ నివేదికను నీతిఆయోగ్ బయట పెట్టలేదు. 2022 డిసెంబర్‌లోనే ఈ ఆరోగ్య సూచీ నివేదిక విడుదల కావాల్సి ఉన్నా ఇప్పటికీ విడుదల కాకపోవడం శోచనీయమని ఈ నివేదికను బయటపెట్టిన ఒక ఆంగ్ల దినపత్రిక పేర్కొన్నది. నీతిఆయోగ్ నిర్వహించిన ఈ ఐదో ఆరోగ్య సూచీ అధ్యయనంలో మొత్తం పనితీరు విభాగంలో కేరళ, తమిళనాడు, తెలంగాణ మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. బీహార్(19), ఉత్తరప్రదేశ్(18), మధ్యప్రదేశ్(17) అట్టడుగున నిలిచాయి.
24 అంశాల ఆధారంగా మదింపు
24 అంశాల ఆధారంగా ఆరోగ్య సూచీలో రాష్ర్టాల పనితీరును మదిం పు చేశారు. ప్రధానంగా ఆరోగ్య ఫలితాలు, పాలన, సమాచారం, కీలక అంశాలను బేరీజు వేశారు. నవజాత శిశువుల మరణాల రేటు, మొత్తం మరణాల రేటు, పుట్టినప్పుడు లింగ నిష్పత్తి, రోగ నిరోధకత కవరేజ్ తదితర అంశాలనూ పరిశీలించారు. 24/7 పని చేసే ఆరోగ్య కేంద్రాల నిష్పత్తి, కార్డియాక్ కేర్ సెంటర్లు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొన్నారు.
★ పోలియో టీకాలకూ కొరతే..
★ గాలిలో దీపంలా దేశంలోని చిన్నారుల ఆరోగ్యం!
★ వైద్య నిపుణుల ఆగ్రహం.. దిగుమతికి సూచన
చిన్నారులకు ప్రాణాంతకంగా మారిన పోలియో వ్యాధి నివారణకు వేసే పోలియో వ్యాక్సిన్‌కు మన దేశంలో కొరత ఏర్పడిందా?.. అంటే అవునని పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. ఏటా నిర్వహించే జాతీయ పోలియో నివారణ దినాన్ని ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. నోటి ద్వారా చిన్నారులకు అందించే పోలియో టీకా కొరత కారణంగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. పల్స్ పోలియోలో భాగంగా ప్రభుత్వం ఏటా జాతీయ రోగ నిరోధకత పెంపు దినోత్సవం (ఎన్‌ఐడీ), ఉప రోగ నిరోధకత పెంపు దినోత్సవం(ఎస్‌ఎన్‌ఐడీ)లను నిర్వహిస్తోంది.
దానిలో భాగంగా 0-5 సంవత్సరాలు పిల్లలకు నోటి ద్వారా పోలియో చుక్కలను వేసేది. అయితే ఈ ఏడాది కావాల్సిన సంఖ్యలో పోలియో వ్యాక్సిన్లు అందుబాటులో లేకపోవడంతో కేవలం ఎస్‌ఎన్‌ఐడీ కార్యక్రమాన్ని మాత్రమే నిర్వహించాలనుకుంటోంది. అది కూడా దేశంలోని 200 హై రిస్క్ జిల్లాలలో మాత్రమే నిర్వహించి చేతులు దులుపుకోవాలని భావిస్తోంది. పాకిస్థాన్, ఆప్ఘనిస్థాన్‌లలో ప్రమాదకరమైన పోలియో వైరస్ 1, 2 విజృంభిస్తున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో భారత్‌లో టీకాలకు కొరత ఏర్పడటం ఆందోళనకరమని, కనీసం వాటిని దిగుమతి చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.