అడవులను పునరుద్ధరించటంలో తెలంగాణ ప్రభుత్వం చురుకుగా పనిచేస్తున్నదని యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ (యూఎస్ ఎయిడ్) మిషన్ ప్రాజెక్టు డైరెక్టర్ వీణారెడ్డి ప్రశంసించారు. అరణ్యభవన్‌లో సోమవారం ఫారెస్ట్ ప్లన్ 2.0 సమీక్షా సమావేశం జరిగింది.
యూఎస్ ఎయిడ్ ఆధ్వర్యంలో తెలంగాణలోని మెదక్ జిల్లాతోపాటు బీహార్, కేరళ రాష్ర్టాల్లోని ఒక్కో జిల్లాలో ఫారెస్ట్ ప్లస్ 2.0 కార్యక్రమాన్ని చేపట్టారు. భౌగోళిక మార్పులను ఎదురొనేందుకు స్థానిక ప్రజల భాగస్వామ్యంతో అడవుల పునరుద్ధరణ, జీవవైవిధ్యం కాపాడటం ఈ ప్రాజెక్టు లక్ష్యం. మెదక్ జిల్లాలో చేపట్టిన ఫారెస్ట్ ప్లస్ పురోగతిపై అటవీ సంరక్షణ ప్రధానాధికారి (కంపా), నోడల్ ఆఫీసర్ లోకేశ్ జైస్వాల్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. యూఎస్ ఎయిడ్ తరఫున రాష్ట్రం లో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటుచేయాలని లోకేశ్ జైస్వాల్ కోరారు.
సమావేశంలో యూఎస్ ఎయిడ్ సీనియర్ ఫారెస్ట్రీ అడ్వైజర్ వర్గీస్ పాల్, డెవలప్‌మెంట్ స్పెషలిస్ట్ (అగ్రికల్చర్) వంశీధర్‌రెడ్డి, సీనియర్ డెవలప్‌మెంట్ కమ్యూనికేషన్స్ ఆఫీసర్ మార్తావాన్ లీయిసౌట్, అడిషనల్ పీసీసీఎఫ్ వినయ్ కుమార్, మెదక్ చీఫ్ కన్జర్వేటర్ సీ శరవణన్, ఫారెస్ట్ ప్లస్ 2.0 తెలంగాణ రీజనల్ డైరెక్టర్ సాయిలు పాల్గొన్నారు.