▪️ తెలంగాణ DNAలోనే వస్త్రకళ ఉంది: సీఎం రేవంత్ రెడ్డి
▪️ హైదరాబాద్‌లో ఘనంగా ఏషియన్ టెక్స్టైల్ కాన్ఫరెన్స్ (ATEXCON) 2026
▪️ జౌళి రంగ మార్పులపై ‘నాలెడ్జ్ పేపర్’ విడుదల
హైదరాబాద్: 2047 నాటికి తెలంగాణను దక్షిణాసియాలోనే టెక్స్టైల్ రాజధానిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రకటించారు. శుక్రవారం నగరంలోని హైటెక్స్, HICC నోవాటెల్‌లో నిర్వహించిన 13వ ఏషియన్ టెక్స్టైల్ కాన్ఫరెన్స్ (ATEXCON 2026)ను ఆయన ప్రారంభించారు. “Reimagining the Future of Global Textiles” (ప్రపంచ జౌళి రంగ భవిష్యత్తు పునర్దర్శనం) అనే ఇతివృత్తంతో జరిగిన ఈ అంతర్జాతీయ సదస్సులో దేశ విదేశాల నుంచి భారీ సంఖ్యలో పారిశ్రామికవేత్తలు, విధాన నిర్ణేతలు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, దక్షిణాసియా టెక్స్టైల్ రాజధానిగా తెలంగాణను తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని సీఎం తెలిపారు. తెలంగాణ DNAలోనే టెక్స్టైల్ రంగం భాగమై ఉందని పేర్కొన్నారు. నిజాం కాలం నుంచే హైదరాబాద్ ప్రపంచ వ్యాప్తంగా వస్త్ర వ్యాపారానికి కేంద్రంగా నిలిచిందని గుర్తు చేశారు. పోచంపల్లి ఇక్కత్, గద్వాల్ చీరలు, వరంగల్ దుర్రీస్, నారాయణపేట చేనేత వంటి సంప్రదాయాలు రాష్ట్ర ప్రత్యేకతను ప్రపంచానికి చాటుతున్నాయని అన్నారు. 2047 నాటికి తెలంగాణను దక్షిణాసియా టెక్స్టైల్ రాజధానిగా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. పెట్టుబడిదారులకు భూమి, విద్యుత్, నీరు, మౌలిక సదుపాయాలు, వేగవంతమైన అనుమతులు అందిస్తామని హామీ ఇచ్చారు. “తెలంగాణ కేవలం ఒక రాష్ట్రం కాదు… పెట్టుబడులకు నమ్మకమైన భాగస్వామి” అని ఈ వేదికపై నుంచి పారిశ్రామికవేత్తలకు ఆయన పిలుపునిచ్చారు.
“Reimagining the Future of Global Textiles” నేపథ్యంలో జరిగిన ఈ సదస్సులో దేశ విదేశాల నుంచి ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, విధాన నిర్ణేతలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జౌళి రంగంలో మార్పులను ప్రతిబింబించే ‘నాలెడ్జ్ పేపర్’ను ముఖ్యమంత్రి విడుదల చేశారు. అనంతరం తెలంగాణ హెరిటేజ్ డిస్ప్లే పెవిలియన్‌ను సందర్శించి నేతన్నల నైపుణ్యాన్ని కొనియాడారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, టీజీఐఐసీ చైర్పర్సన్ తూర్పు నిర్మలా జగ్గారెడ్డి, తెలంగాణ పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ ఈ సదస్సులో పాల్గొని ప్రసంగించారు. ప్యానెల్ చర్చల్లో గ్లోబల్ టెక్స్టైల్ రంగంలో కొత్త ఆవిష్కరణలు, సర్క్యులర్ ఎకానమీ విధానాలు, సహజ రంగుల వినియోగం, వ్యర్థాల నిర్వహణ వంటి అంశాలపై నిపుణులు విశ్లేషణలు చేశారు. అలాగే నైపుణ్యాభివృద్ధి కోసం జాతీయ అప్రెంటిస్‌షిప్ ప్రమోషన్ స్కీమ్ (NAPS) ప్రాధాన్యతను అధికారులు వివరించారు.
తెలంగాణలో పెట్టుబడుల అవకాశాలను పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ (IAS), ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పారిశ్రామికవేత్తలకు వివరించారు. ముఖ్యంగా పి.ఎం మిత్రా పార్కుల పురోగతి, మౌలిక సదుపాయాల లభ్యతపై ప్రత్యేక రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు.
Confederation of Indian Textile Industry ప్రతినిధులు మాట్లాడుతూ, ఈ సదస్సు భారత జౌళి రంగం గ్లోబల్ వాల్యూ చైన్‌లో కీలక పాత్ర పోషించేందుకు మార్గసూచిగా నిలిచిందన్నారు. ముగింపు కార్యక్రమంలో పలువురు ప్రతినిధులు తెలంగాణను గ్లోబల్ టెక్స్టైల్ మ్యాప్‌లో మరింత బలంగా నిలబెట్టే వేదికగా ఈ కాన్ఫరెన్స్ నిలిచిందని అభిప్రాయపడ్డారు.


























