ఏ ప్రదేశమైనా, ఏ రాష్ట్రమైనా ఒకేసారి అభివృద్ధి చెందడం సాధ్యం కాదు. క్రమక్రమంగానే అభివృద్ధి సాధ్యమవుతుంది. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఏర్పడిన టి.ఆర్.ఎస్. అధికారంలోకి వచ్చినప్పటి నుండీ క్రమక్రమంగా అన్ని అంశాల్లోనూ అభివృద్ధిని సాధిస్తూ వస్తోందనే చెప్పాలి. విపక్షాల విమర్శలు ఏ ప్రభుత్వానికైనా మామూలే. విపక్షాలు చేసే విమర్శల్లో చాలావరకు రాష్ట్రంలో అధికారాన్ని హస్తగతం చేసుకోవాలనే ఉద్దేశంతోనే వుంటాయనేది నిర్వివాదాంశం. ఇది మన రాష్ట్రంలోనే కాదు, అన్ని రాష్ట్రాల్లోనూ, దేశంలోనూ వుంటుంది.
ఇకపోతే పారిశ్రామికంగానే కాకుండా, తలసరి ఆదాయం, పన్నుల రాబడి, జీడీపీ తదితర అంశాల్లో దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న తెలంగాణ తాజాగా మరో కీలకమైన అంశంలో టాప్ లేపింది. బహిరంగ మల విసర్జన రహిత (ఓడీఎఫ్ ప్లస్)లో తెలంగాణ దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఉత్తమ ఫలితాలు సాధించి అగ్ర స్థానంలో నిలిచింది.
ఈ మేరకు శుక్రవారం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఓడీఎఫ్ ర్యాంకుల్లో 99.98 శాతంతో ఈ జాబితాలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రంలో మొత్తం 12,769 గ్రామాలు ఉండగా… వాటిలో 12,766 గ్రామాలు ఓడిఎఫ్ గ్రామాలుగా గుర్తింపు సంపాదించాయి. ఓడీఎఫ్ లేని గ్రామాలుగా తెలంగాణలో కేవలం మూడంటే మూడు గ్రామాలు మాత్రమే మిగిలాయి. వెరసి ఓడీఎఫ్ సాధనలో తెలంగాణ రాష్ట్రం 99.98 శాతం ఫలితాలను రాబట్టినట్టయింది.