నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, నరసింహ రాజు ప్రధాన పాత్రలలో ఆపిల్ క్రియేషన్స్ బ్యానర్ పై డా.జగన్ మోహన్ డి వై నిర్మాతగా వెంకటేష్ పెదిరెడ్ల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అనుకోని ప్రయాణం’. బెక్కం వేణుగోపాల్ సమర్పణలో అక్టోబర్ 28న థియేటర్లో విడుదలైన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. చిత్రానికి అన్ని వర్గాల నుండి అద్భుతమైన స్పందన వస్తున్న నేపధ్యం లో యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించిది.
నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. ఒక మంచి సినిమా వస్తే తెలుగు ప్రేక్షకులు ఎంత గొప్పగా ఆదరిస్తారో ‘అనుకోని ప్రయాణం’ మరోసారి రుజువు చేసింది. ‘అనుకోని ప్రయాణం’ ఇంత అద్భుతమైన టాక్ రావడానికి కారణమైన ప్రేక్షకులకు హృదయపూర్వక నమస్కారాలు. ప్రతి ఒక్కరూ పాజిటివ్ రివ్యూలు ఇచ్చారు. ఒక్క నెగిటివ్ రివ్యూ కూడా రాకపోవడమే ఈ సినిమాకి ఫస్ట్ సక్సెస్. ‘అనుకోని ప్రయాణం’ అందరూ తప్పక చూడాల్సిన సినిమా. మానవ విలువలు తగ్గిపోతున్న కాలంలో వాటిని గుర్తు చేస్తూ అద్భుతంగా ఈ కథని తీశాం. ఇలాంటి సినిమాలు అరుదుగా వస్తుంటాయి. ‘అనుకోని ప్రయాణం’ చూశాక ప్రేక్షకులు గొప్ప ఫీలింగ్ ని ఇంటివరకూ తీసుకెళ్తున్నారు. ఈ ఫీలింగ్ ని పక్క వారితో పంచుకుంటే మంచి సినిమా తీయడానికి మేము పడిన తపనకు తగిన ఫలితం దక్కినట్లు అవుతుంది. శివ గుర్తుండిపోయే పాటలు చేసారు.
ఇందులో నటీనటులు అనుభవం వున్న వాళ్ళం కానీ సాంకేతిక నిపుణులు అంతా కొత్త వారు. అందరూ కొత్త వాళ్ళు ఒక అద్భుతమైన కథ చేసి ప్రేక్షకులు తీసుకొస్తే ప్రేక్షకులు చాలా చక్కగా ఆదరిస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఇంత పాజిటివ్ రివ్యూలు ఏ సినిమాకి రాలేదు. ప్రేక్షకులు ఆదరణకు మరోసారి కృతజ్ఞతలు. సినిమా చూసిన ప్రేక్షకులు స్పందనని మర్చిపోలేను. ఈ సినిమాని మిగతా భాషలల్లో కూడా డబ్ చేసి విడుదల చేస్తాం మీ మనస్సులో వుండిపోయే సినిమా ఇది. . ఈ సినిమాని మరింతగా ఆదరించాలి.” కోరారు.