ప్రెస్ క్లబ్ కార్య నిర్వాహక వర్గానికి మార్చ్ 2022 లో జరిగిన ఎన్నికలు చెల్లవని ప్రకటించాలనీ, ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో మా బృందం గెలిచిందని రిటర్నింగ్ ఆఫీసర్ చేసిన ప్రకటనను కొట్టి వేయాలనీ, మాజీ ప్రధాన కార్యదర్శి రాజమౌళి చారి తనను ప్రధాన కార్యదర్శిగా కొనసాగించాలని విచ్ఛిన్నకారులు వేసిన మూడు పిటిషన్ లను టెన్త్ అడిషనల్ సివిల్ కోర్టు ఇవాళ కొట్టివేసిందనే వార్తను పంచుకోవడం మాకు సంతోషంగా ఉంది. అంటే మార్చ్ 13న జరిగిన ఎన్నికలు సక్రమమేననీ, ఆ ఎన్నికల్లో మా బృందం గెలిచిందని రిటర్నింగ్ ఆఫీసర్ ఇచ్చిన సర్టిఫికెట్ చెల్లుతుందనీ ఇప్పుడు చట్టబద్ధంగా నిర్ధారణ అయింది.
ఎన్నికల్లో పదిహేడు పోస్టులకు పోటీ జరగగా, పదహారు పోస్టుల ఓట్ల లెక్కింపు, గెలిచిన అభ్యర్థుల ప్రకటన, గెలుపు సర్టిఫికెట్ల మీద సంతకాలు సజావుగా జరిగిపోయాయి. తర్వాత, అధ్యక్ష స్థానానికి జరిగిన ఓట్ల లెక్కింపులో మా అభ్యర్థి 80 వోట్ల ఆధిక్యతతో గెలిచారు. ఓడిపోయిన అభ్యర్థి రెండు సార్లు రికౌంటింగ్ అడిగి, ఆ రెండు సార్లు కూడా తనకు అనుకూలమైన ఫలితం రాకపోవడంతో ప్రెస్ క్లబ్ లో విధ్వంసం ప్రారంభించారు. బైటి నుంచి జర్నలిస్టులు కాని సంఘ వ్యతిరేక శక్తులను పిలిపించి, బాలట్ పెట్టెల్లో నీళ్ళు పోశారు. ఎన్నికల అధికారులను బెదిరించారు. చివరికి కోర్టుకు కూడా వెళ్ళి తప్పుడు ఆధారాలతో ఎన్నికల ఫలితాలను నిలుపుదల చేయించారు. మరొక వైపు మాజీ ప్రధాన కార్యదర్శి తననే కార్యదర్శిగా కొనసాగించాలని కోర్టుకు వెళ్ళి సమస్య పరిష్కారం కాకుండా కాలయాపన చేయదలిచాడు. కాని చివరికి న్యాయం గెలిచింది. మేం న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా ఎన్నికయ్యామని కోర్టు ప్రకటించింది.
ఐదు నెలల పాటు ప్రెస్ క్లబ్ సక్రమంగా నడవకుండా అడుగడునా అడ్డుకున్నారు.ప్రెస్ క్లబ్ ను జలగలా పట్టుకుని వేలాడే కొంతమంది మనసభ్యుల్లో క్లబ్ ప్రతిష్టను దిగజార్చ దానికి, క్లబ్ లోపల – బయట తప్పుడు ప్రచారం విస్తృతంగా చేశారు. జర్నలిస్టు సభ్యులకు ప్రెస్ క్లబ్ సేవలు అందకుండా అడ్డుకున్న బాధ్యత ఎన్నికల ఫలితాల మీద కోర్టుకు వెళ్ళిన విచ్ఛిన్నకర సోకాల్డ్ జర్నలిస్టులదే అని మరొకసారి గుర్తు చేస్తున్నాం. ఈ ఐదు నెలలపాటు ఓపికగా మాకు అండగా నిలిచిన జర్నలిస్టు పెద్దలు, సంఘాల నేతలు, జర్నలిస్టులందరికీ మా ధన్యవాదాలు అని ప్రస్తుతం ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో గెలిచిన పాలకవర్గం అన్నారు.