Murder Issue : రాష్ట్రంలో రోజురోజుకీ క్రైమ్స్ పెరిగిపోతున్నాయని అనిపిస్తుంది. పోలీసులు, ప్రభుత్వాలు కఠినచర్యలు తీసుకుంటున్నప్పటికి వీరి ఆగడాలకు బ్రేక్ పడడం లేదు. తిరుపతిలో దోపిడీ దొంగలు దంపతుల కళ్లలో కారం కొట్టి దాడి చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. పుండనూరు మండలం లోని నెక్కుంది గ్రామానికి చెందిన రెడ్డప్ప కుమారుడు దాము, తన భార్య అనురాధతో కలిసి అత్త గారింటికి వెళ్లి తిరిగి ప్రయాణం అయ్యారు. సాయంత్రం ఏడు గంటల సమయంలో తుర్లపల్లి గ్రామ సమీపాన ఉన్న దొనబండ ప్రాంతానికి చేరుకోగానే… గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులు వచ్చి వారిని అడ్డగించినట్లు అనురాధా తెలిపారు.
ఆ తర్వాత తమపై కారంపొడి చల్లి, నగలు ఇవ్వాలని కత్తితో బెదిరించారని తెలిపింది. నగలు ఇవ్వొద్దని కేకలు వేయడంతో దుండగులు తన భర్తను వెంబడించి కత్తితో పొడవగా తాను తప్పించుకుని కేకలు వేస్తుండటంతో గ్రామస్థులు రావడంతో దుండగులు పరారైయ్యారని అనురాధ తెలిపింది. అయితే ఈ ఘటనలో దాము అక్కడక్కడ మృతి చెందినట్లు తెలుస్తుంది. ఒక సంవత్సరం క్రితమే మృతుడికి పెళ్లి అయినట్లు వారి బంధువులు తెలిపారు.
పెళ్లి జరిగే ఒక ఏడాది తిరిగేలోపే హత్యకు గురి కావడంతో… దాము కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పుంగునూరు అర్బన్ సీఐ గంగిరెడ్డి ఎస్సై మోహన్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వ వైద్యశాలకు పంచనామా నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. దాము మృతి వార్తతో వారి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.