ఒక కొత్త కాన్సెప్ట్ తో సినిమా వచ్చిందంటే ప్రేక్షకులు భాషాబేదం చూడకండా ఆ సినిమాను ఒకటికి నాలుగుసార్లు చూసేస్తారు, అభిమానిస్తారు, ఆదరిస్తారు. దాంతో ఆ సినిమా సూపర్ డూపర్ హిట్టైపోతుంది. వసూళ్ల వర్షం కురుస్తుంది. ప్రస్తుతం కన్నడలో రూపొందిన ‘కాంతార’ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో సైతం అనూహ్యమైన ప్రభంజనం సృష్టించింది. వసూళ్ల పరంగానూ చరిత్ర సృష్టించింది ‘కాంతార’.
అయితే, హిట్టు కొట్టిన సంతోషం ‘కాంతార’కు నాలుగు రోజులు కూడా నివలలేదు. కన్నడ సినీ నటుడు, దర్శకుడు రిషభ్ శెట్టి తెరకెక్కించిన ‘కాంతార’ సినిమా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం ఇతర భాషల ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. భాషలకు అతీతంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. మరోవైపు ఈ చిత్రం వివాదంలో చిక్కుకుంది.
ఈ చిత్ర బృందానికి ‘తైక్కుడం బ్రిడ్జ్’ మ్యూజిక్ బ్యాండ్ లీగల్ నోటీసులు పంపింది. ‘కాంతార’ పతాక సన్నివేశాల్లో వచ్చే ‘వరాహ రూపం’ పాట తమ ‘నవరస’కు కాపీ అని నోటీసులో పేర్కొంది. అంతేకాదు తమకు మద్దతు ఇవ్వవలసిందిగా సోషల్ మీడియాలో నెటిజన్లకు విన్నవించింది. ‘కాంతార’ చిత్రానికి, తమకు ఎలాంటి సంబంధం లేదని… తమ పాట కాపీ రైట్ చట్టాలను ఉల్లంఘించారని చెప్పారు. అందువల్లే ఈ కాపీకి కారణమైన వాళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ‘కాంతార’ ఈ వివాదం నుండి ఎలా గట్టెక్కుతుందో చూడాలి.