TRS Party General secretary Palla Rajeshwar Reddy, Telangana Political News, Biggest Party TRS, CM KCR, Telugu World Now,
Telangana Political News: అతిపెద్ద ప్రాంతీయ పార్టీ టీఆర్‌ఎస్: పల్లా రాజేశ్వర్ రెడ్డి
61 లక్షల సభ్యులతో దేశంలోనే నంబర్‌వన్
వారంలో సభ్యత్వాల డిజిటలైజేషన్ పూర్తి
త్వరలో సీఎం కేసీఆర్ చేతులమీదుగా పార్టీ కార్యాలయాల ప్రారంభం
రెండు నెలల్లో కమిటీలు.. అనంతరం శిక్షణ
నియోజకవర్గానికో సోషల్ మీడియా బృందం
పార్టీ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్‌రెడ్డి
టీఆర్‌ఎస్ 61 లక్షల సభ్యత్వంతో దేశంలోనే అతిపెద్ద ప్రాంతీయ పార్టీగా రికార్డు నెలకొల్పిందని ఆ పార్టీ ప్రధా న కార్యదర్శి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. వారంలో పార్టీ సభ్యత్వ నమో దు డిజిటలైజేషన్‌ను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకొన్నట్టు ఆయన వెల్లడించారు. బుధవారం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కే తారక రామారావు అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో కార్యనిర్వాహక సమావేశం జరిగింది. సమావేశానంతరం పల్లా మీడియాతో మాట్లాడుతూ.. సమావేశంలో తీసుకొన్న నిర్ణయాలను వివరించారు. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వం, శిక్షణ తదితర అంశాలపై పార్టీకి దిశానిర్దేశం చేశారని తెలిపారు. దేశంలో మరే రాజకీయ పార్టీకి లేనివిధంగా 61 లక్షల మంది టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకొన్నారని, 48 లక్షల సభ్యత్వాలకు సంబంధించి డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయిందని, మిగిలినవి వారంలో పూర్తిచేయాలని కేటీఆర్ నిర్ణయించారని వివరించారు. వచ్చే నెల 1 నుంచి సభ్యత్వం తీసుకొన్నవారికి ప్రమాదబీమా వర్తించేలా చర్యలు తీసుకొంటామని, ఈ విషయంలో ఎమ్మెల్యేలు, నియోజకర్గ ఇన్‌చార్జిలు తమ లక్ష్యాన్ని నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని కోరారు.
త్వరలో జిల్లాల్లో పార్టీ ఆఫీసుల ప్రారంభం
రాష్ట్రంలో 31 జిల్లాలో చేపట్టిన టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాల నిర్మాణాల్లో 24 పూర్తయ్యాయని పల్లా తెలిపారు. వాటిని త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించాలని కార్యనిర్వాహక సమావేశం తీర్మానించిందని వెల్లడించారు. మిగిలిన 7 జిల్లాల పార్టీ కార్యాలయాలు పూర్తవుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
కృష్ణానదిలో చుక్క నీరూ వదులుకోం
కృష్ణానదిలో తెలంగాణకు దక్కాల్సిన చుక్క నీటిని కూడా వదులుకోబోమని పార్టీ నిర్ణయించినట్టు పల్లా తెలిపారు. పార్టీ కార్యనిర్వాహక సమావేశంలో ఈ అంశంపై సుదీర్ఘ చర్చ జరిగిందని వెల్లడించారు. లిఫ్టింగ్ ది రివర్ పేరిట డిస్కవరీ చానల్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ కౌశలాన్ని ప్రపంచానికి చాటిందని పేర్కొన్నారు. కాగా, తెలంగాణ ఉద్యమ ట్యాగ్‌లైన్ నీళ్లు.. నిధులు.. నియామకాలను అనతికాలంలోనే సాధించిన సీఎం కేసీఆర్‌కు టీఆర్‌ఎస్ కార్యనిర్వాహక సమావేశం కృతజ్ఞతలు తెలిపిందని పల్లా చెప్పారు. దళిత సాధికారత పథకం, రిక్రూట్‌మెంట్ క్యాలెండర్, 50 వేల ఉద్యోగాల కల్పనకుగానూ సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు చెప్పినట్టు తెలిపారు. అటు.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన తెలంగాణభవన్‌లో జరిగిన ప్రధాన కార్యదర్శుల సమావేశం మూడున్నర గంటలపాటు సుదీర్ఘంగా సాగింది. సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శులు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సంతోష్‌కుమార్, శ్రవణ్‌కుమార్‌రెడ్డి, బండాప్రకాశ్, రాములు, సత్యవతి రాథోడ్, గ్యాదరి బాలమల్లు, గంగాధర్‌గౌడ్, బస్వరాజు సారయ్య, ప్రొఫెసర్ ఎం శ్రీనివాస్‌రెడ్డి,
తక్కళ్లపల్లి రవీందర్‌రావు, భరత్‌కుమార్, బండి రమేశ్, బీ నరేంద్రనాథ్, గంగాధర్‌గౌడ్, బోడకుంటి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
రెండునెలల్లో సంస్థాగత నిర్మాణం
సభ్యత్వ నమోదు డిజిటలైజేషన్ పూర్తయ్యాక గ్రామస్థాయి/బస్తీ కమిటీలు, మండల కమిటీలు, నియోజకర్గ కమిటీలు, రాష్ట్ర కమిటీ ఇలా అన్ని కమిటీలను రెండు నెలల్లో పూర్తిచేస్తామని రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. ఈసారి నియోజకవర్గ స్థాయిలో ఉత్సాహవంతులైన యువకులతో సోషల్ మీడియా కమిటీని వేయాలని పార్టీ నిర్ణయించిందని పేర్కొన్నారు. కమిటీల నియామకం పూర్తయ్యాక కమిటీల బాధ్యులకు శిక్షణ తరగతులు నిర్వహించాలని సమావేశం తీర్మానించిందని వెల్లడించారు.