రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన టీఎస్‌ఐపాస్‌తో 16.4 లక్షల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు కల్పించామని రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు తెలిపారు. హార్ట్‌ఫుల్‌నెస్, యునెస్కో ఎంజీఐఈపీ, ఏఐసీటీఈ సంయు క్త ఆధ్వర్యంలో శుక్రవారం నందిగామ మండలం కన్హా శాంతివనంలో నిర్వహించిన అంతర్జాతీయ యువజన సదస్సులో మంత్రి కేటీఆర్ జూమ్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఎస్‌ఐపాస్‌తో పారిశ్రామిక రంగంలో నూతన శకం మొదలైందని చెప్పారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేలా 15 రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేస్తున్నామని తెలిపారు.
హైదరాబాద్ నేడు ప్రపంచ వ్యాక్సిన్ రాజధానిగా మారిందని, కొవిడ్ వ్యాక్సిన్‌ను తెలంగాణ నుంచే దేశానికి అందించామని వెల్లడించారు. దేశంలో తెలంగాణ మాత్రమే ఇంటింటికీ తాగునీరు అందిస్తున్నదని వివరించారు. పంచాయతీరాజ్ చట్టం, మున్సిపల్ చట్టం వంటి అనేక చట్టాలను అమల్లోకి తీసుకొచ్చి, పట్టణాలు, గ్రామాలను అభివృద్ధి బాట పట్టించామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన అవార్డుల్లో దేశంలో టాప్- 20 గ్రామా ల్లో 19 గ్రామపంచాయతీలు తెలంగాణవే కావటం ఇందుకు నిదర్శనమని చెప్పారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లోనూ 12 మున్సిపాలిటీలకు కేంద్ర ప్రభుత్వం అవార్డులను ప్రకటించిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో అడవుల శాతా న్ని పెంచేందుకు హరితహారం కార్యక్రమాన్ని చేపట్టామని, ఎనిమిదేండ్లలో 240 కోట్ల మొక్కలను నాటామని వివరించారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం 550కిపైగా థియేటర్లలో గాంధీ చిత్రాన్ని ప్రదర్శిస్తున్నామని, రాష్ట్రంలోని 22 లక్షల మంది విద్యార్థులు ఉచితంగా ఈ సినిమా చూసే అవకాశాన్ని కల్పించామని వెల్లడించారు.
తాగునీరు అందించిన తొలి రాష్ట్రం తెలంగాణ: కమలేశ్ పటేల్ దాజీ
దేశంలోనే తొలిసారి అన్ని గ్రామాలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించిన ఘనత తెలంగాణ సర్కారుదేనని హార్ట్‌ఫుల్‌నెస్ గైడ్ కమలేశ్ పటేల్ దాజీ కొనియాడారు. మహిళలు తాగునీటి కోసం కిలోమీటర్ల మేర క్యూలైన్లలో నిల్చున్న దృశ్యాలను అనేక రాష్ర్టాల్లో చూశామని, తెలంగాణలో మాత్రం ఇంటింటికీ నల్లా ద్వారా తాగునీరు అందిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశంసించారు. ఈ సదస్సులో యునెస్కో ఎమ్‌జీఐఈపీ డైరెక్టర్ అనంత దురైయప్ప, హార్ట్‌ఫుల్‌నెస్ సంస్థ డైరెక్టర్ సంజయ్ సెహగల్, డైరెక్టర్ రమేశ్ కృష్ణన్, గాయని ఖతీజా రెహమాన్, గ్రేస్‌మూరు పాల్గొన్నారు.