మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం చేస్తూ మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవ దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ సంయుక్తంగా నిర్మించిన ప్రేమకథా చిత్రం “ఉప్పెన”. ఈ చిత్రం ప్రీ-రిలీజ్ వేడుక సినీ ప్రముఖులు, మెగా అభిమానుల మధ్య అత్యంత వైభవంగా జరిగింది. మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిధిగా విచ్చేసిన ఈ ఫంక్షన్ కి ప్రముఖ దర్శకులు కొరటాల శివ, హరీశ్ శంకర్, గోపిచంద్ మలినేని, బాబీ, సందీప్ వంగా, శివ నిర్వాణ, కిషోర్ తిరుమల, వెంకీ కుడుముల విశిష్ట అతిధులుగా హాజరయ్యారు.. సుకుమార్, హీరో వైష్ణవ్ తేజ్, హీరోయిన్ కృతి శెట్టి, దేవిశ్రీప్రసాద్, కెమెరామెన్ శ్యామ్ దత్, కళా దర్శకులు రామకృష్ణ, మౌనిక, గేయ రచయిత చంద్రబోస్, నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, సిఇఓ చెర్రీ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ అశోక్, అనిల్, నటుడు జయరాజ్ తదితరులు పాల్గొన్నారు. “ఉప్పెన” న్యూ ట్రైలర్ ను హరీశ్ శంకర్ రీ లాంచ్ చేశారు. ఫిబ్రవరి 12న ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్స్ లలో విడుదల కానున్న “ఉప్పెన” ఫస్ట్ టికెట్ ను మెగాస్టార్ చిరంజీవి కొనుగోలు చేశారు.
మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. సినిమా అద్భుతమైన దృశ్యకావ్యంలా ఉంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఎమోషన్స్ సీన్స్ అన్నీ కట్టిపడేసేలా ఆద్యంతం ఉత్కంఠ కలిగించేలా గొప్పగా చిత్రీకరించారు. స్క్రీన్ ప్లే చాలా గొప్పగా ఉంటుంది. సినిమా చూశాక నాకు 80, 90 దశకంలో భారతీ రాజా గారు తీసిన సినిమాలు గుర్తుకువచ్చాయి. విలేజ్ బ్యాక్ డ్రాప్స్ లో మట్టికథలతో ఆయన గొప్ప చిత్రాలు చేశారు. ఇది మన కథ. మన నేటివిటీ ఉన్న ప్రేమకథ అని ఉప్పెన రుజువు చేస్తుంది. అంత గొప్ప సినిమా చేసిన బుచ్చిబాబు ని అభినందిస్తున్నాను. విజయ్ సేతుపతి వెర్సటైల్ యాక్టర్. ఒక పక్క హీరోగా చేస్తూ, మరో పక్క ఇంపార్టెన్స్ క్యారెక్టర్స్ చేస్తున్న విజయ్ కి హ్యాట్సాప్. కృతి శెట్టి బ్యూటిఫుల్ పెర్ఫార్మెన్స్ చేసింది. ఇక ఈ చిత్రంలో అత్యద్భుతంగా నటించిన వైష్ణవ్ తేజ్ మా మెగా ఫ్యామిలీకి, నాకు గర్వకారణం.