Banana for Hair : చిన్నా, పెద్దా లేకుండా ప్రతి ఒక్కరిని వేధిస్తున్న సమస్య జుట్టు రాలడం. మారిన లైఫ్‌స్టైల్, కాలుష్యం, ఒత్తిడి, నిద్రలేమి వంటి కారణాల వల్ల ఈ రోజుల్లో జుట్టు సమస్యలు ఎక్కువవుతున్నాయి. జుట్టు రాలడం, నిర్జీవంగా మారడం, స్ప్లెట్ హెయిర్, చండ్రు సమస్యలతో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ సమస్యలను పరిష్కరించుకోవడానికి.. ఖరీదయిన ఉత్పత్తులు వాడుతూ ఉంటారు. మనకు ఏ సీజన్లోనైనా ఈజీగా, తక్కువ ధరలో దొరికే అరటిపండ్లు..హెయిర్ ఫాల్‌ను తగ్గించి, సిల్కీగా, హెల్తీగా మారుస్తాయి. అరటిపండులో పొటాషియం, సిలికా, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, ఫైబర్, నేచురల్ ఆయిల్స్‌తో పాటు ప్రొటీన్లు ఉంటాయి. ఈ పోషకాలు జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి.
అరటి పండు, పెరుగు మాస్క్..
రెండు పండిన అరటిపండ్లను గుజ్జుగా చేయండి. ఆ గుజ్జులో పెరుగు మిక్స్ చేయండి. ఈ పేస్ట్‌ను స్కాల్ప్‌కు, జుట్టుకు అప్లై చేసి.. 15 నిమిషాల పాటు ఆరనివ్వండి. ఆ తర్వత గోరువెచ్చని నీళ్లతో తలస్నానం చేయండి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే.. కుదుళ్లు దృఢంగా మారతాయి, జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. పెరుగులోని పోషక విలువలు.. జుట్టును మృదువుగా, పట్టులా ఉంచుతాయి.
అరటిపండు, బొప్పాయి..
అరటి, బొప్పాయిని గుజ్జుగా చేసి దానిలో తేనె మిక్స్ చేయండి. ఈ పేస్ట్‌ను స్కాల్ప్‌కు, జుట్టుకు అప్లై చేసి 15 నిమిషాల పాటు ఆరనివ్వండి. ఇలా వారానికి రెండు సార్లు అప్లై చేస్తే.. జుట్టు వేగంగా పెరుగుతుంది. ఈ ప్యాక్‌లోని ఫోలిక్ యాసిడ్ జుట్టుకు పోషణ అందించి ఆరోగ్యంగా ఉంచుతుంది.
అరటిపండు, కొబ్బరి నూనె..
బాగా మగ్గిన అరటిపండు ఒకటి తీసుకుని గుజ్జులా చేసుకోవాలి. అందులో చెంచా చొప్పున కొబ్బరి, ఆలివ్‌నూనె కలిపి తలకు పూతలా వేసుకోవాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీళ్లతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే.. హెయిర్ ఫాల్ తగ్గుతుంది.