ఈ మధ్యే పెళ్లితో ఒక్కటైన ప్రముఖ సినీనటి నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్ .. తిరుమల దర్శనానికి వెళ్లిన తర్వాత వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. భక్తుల నుంచి విమర్శలు రావడంతో విఘ్నేష్ శివన్ క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
నూతన జంట శ్రీవారిని దర్శించుకునేందుకు శుక్రవారం తిరుమల వచ్చింది. స్వామివారి దర్శనం తర్వాత తిరుమల మాడ వీధుల్లో వారు చెప్పులు వేసుకుని తిరగడం.. ఆలయం వద్ద ఫొటోషూట్ చేసుకోవడంపై వివాదం చెలరేగింది. దీనిపై భక్తులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో విఘ్నేష్ శివన్ ఓ ప్రకటనను విడుదల చేశారు.
ఆలయ ఆవరణలో ఫొటో షూట్ చేసుకోవాలనుకున్నామని.. భక్తులు ఎక్కువగా ఉండటంతో త్వరగా పూర్తిచేయాలనే ఉద్దేశంతో గందరగోళ పరిస్థితుల్లో తమ కాళ్లకు చెప్పులు ఉన్నాయనే విషయాన్ని మర్చిపోయామని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంలో తమను క్షమించాలని ఆ ప్రకటనలో విఘ్నేష్ శివన్ కోరారు. తిరుమల శ్రీవారిపై తమకు అపారమైన నమ్మకముందని.. అవమానించేందుకు అలా చేయలేదని పేర్కొన్నారు.