ప్రముఖ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తన సినీ కెరీర్‌లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని.. ‘లైగర్’ ఫ్లాప్‌ను ఆయన పట్టించుకోరని ప్రముఖ దర్శకుడు, అతడి ఫ్రెండ్ వీవీ వినాయక్ అన్నారు. ఓ ఇంటర్వ్యూలో వినాయక్ మాట్లాడారు. ఫ్లాప్‌తో ఆస్తులమ్మి మరీ అప్పులు తీర్చాడని ఊహాగానాలు వచ్చాయి. ఈ విషయంపై వినాయక్ స్పందించారు.
గతంలోనూ పూరీ జగన్నాథ్ ఎన్నో ఆటుపోట్ల ఎదుర్కొన్నాడని.. అన్నింటినీ ఆయన అధిగమిస్తాడని వినాయక్ చెప్పారు. అతడి కెపాసిటీ ఏంటో తమకు తెలుసని చెప్పాడు. ‘లైగర్’ ఫ్లాప్‌తో పూరీ జగన్నాథ్ జీవితం ఏమీ మారదని.. గతంలో ఎన్నో ఫ్లాప్స్, హిట్స్, సూపర్‌హిట్స్ ఆయన అందుకున్నారని గుర్తు చేశారు. ‘‘కొంతమంది ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ఇలాంటి వార్తలు సృష్టిస్తున్నారు.
పోయిన దాన్ని పూరీ తిరిగి పొందలేనంత అసమర్థుడేమీ కాదు. ఫ్లాప్స్ వచ్చినపుడు ఆయన పని అయిపోయిందని కొంతమంది అనుకున్నారు. కానీ ‘పోకిరి’తో బ్లాక్‌బస్టర్ హిట్ ఇచ్చాడు. సినిమా అన్నాక ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఉండటం సహజం. ‘లైగర్’ వల్ల ఎంత పోయింది? ఎంత వచ్చింది?అనేది అతడికే తెలుసు. ఆయన తెరకెక్కించిన సినిమా ఏదైనా ఫ్లాప్ అయితే బయటవాళ్లందరూ ఏవేవో అనేసుకుంటారు. కానీ అతడు అలా కాదు. ఫ్లాప్ వస్తే దాని గురించి ఎక్కువగా ఆలోచించడు. అతడు ఒక యోగి. ధైర్యవంతుడు’’ అని వీవీ వినాయక్ అన్నారు.