జనరల్ గా ఎవరికైనా పోలీస్ స్టేషన్ కి వెళ్లాలంటేనే భయం వేస్తుంది. ఏదైనా కేసులో ఇరుక్కుని వెళ్లే వాళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక దొంగతనాలు చేసినవారు పారిపోయి ఎక్కడీనా దాక్కుని దొరికిపోతామని తెలిసినా ఎక్కడ పోలీసులకు దొరికిపోతామోనని బిక్కుబిక్కుమంటూ కాలాన్ని గడుపుతారు. దొరికిపోయాక ఎలా వుంటుందో ప్రొఫెషనల్ దొంగలకు ప్రత్యక్షంగా తెలిసే వుంటుంది.
అయితే, ఏకంగా పోలీసుల తుపాకీనే ఎత్తుకుపోయి పోలీసులకు ముచ్చెమటలు పట్టించేవాడిని ఏమనాలి? మీరేమైనా అనండి, వాడు మాత్రం సాక్షాత్తూ ఇదే పని చేశాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. కాన్పూర్ జిల్లా ఆజాద్ నగర్ పరిధిలోని ఒక ఔట్ పోస్టులో తుపాకీ కనిపించకపోవడంతో ఔట్ పోస్ట్ ఇన్ ఛార్జి సుధాకర్ పాండేపై కేసు నమోదు చేశారు. ఈ విషయం ఉన్నతాధికారులకు తెలవడంతో పాండేపై జిల్లా ఎస్పీ వేటు వేశారు.
ఈ క్రమంలో ఔట్ పోస్టును పరిశీలించిన అధికారులు తుపాకీతో పాటు పది కాట్రిజ్ లు, యూనిఫాం కూడా పోయాయని గుర్తించారు. ఈ చోరీపై ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. సమీపంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఇంతకీ, ఆ దొంగ ఎవరై వుంటారాని అంత సుదీర్ఘంగా ఆలోచించకండి. ఎందుకంటే, ఈరోజు కాకపోతే రేపైనా ఆ దొంగ గ్యారంటీగా దొరికేస్తాడని మనకే కాదు, చిన్న పిల్లలకైనా తట్టే విషయం. కాకపోతే, ఇంతకీ ఆ ఘరానా దొంగ ఇంతటి దొంగతనానికి ఎందుకు ఒడిగట్టాడన్నదే ప్రధానమైన విషయం.