సినిమా అంటే ఏంటి, ఎలా వుండాలి ? ఇక్కడ మనం ముఖ్యంగా మాట్టాడుకోవలసిన విషయమేంటంటే… పూర్వకాలంలో రేడియో మాత్రమే వుండేది. శ్రవణ మాధ్యమంలో వుండే ఒక అసౌకర్యమేంటంటే కేవలం వినిపిస్తుంది కాబట్టి ప్రతి విషయాన్నీ మాటల్లో చెప్పి తీరాలి. ఉదాహరణకు ఒక పోలీసు ఇంటికి వచ్చాడంటే ‘అదిగో… సమయానికి పోలీసు అన్నయ్య కూడా వచ్చేశారు…’ అని మరో క్యారెక్టర్ చేత చెప్పించి తీరాల్సిందే…! విజువల్ గా అయితే ఆ మాట అనాల్సిన అవసరం వుండదు. ఎందుకంటే, పోలీసు డ్రెస్సులోనే ఆ క్యారెక్టర్ ఎంట్రీ వుంటుంది కాబట్టి. అయితే, ఒక సినిమాని దర్శకుడు ఎంత బాగా దృశ్యపరంగా చిత్రీకరిస్తే సినిమా అంత బావుంటుంది. సినిమా మొదలైనప్పటి నుండీ చివరిదాకా కేవలం డైలాగులపైనే నడిపించకండా విజువల్ పరంగా చెప్పినప్పుడు ప్రేక్షకులకు కూడా ఎంతగానో నచ్చుతుంది. దీనికి ఉదాహరణగా కొన్ని విషయాల గురించి మాట్టాడుకుందాం.
ఒక బ్లాక్ అండ్ వైట్ సినిమాలో చిన్న హంగామా జరిగే సన్నివేశంలో సూర్యకాంతం హడావిడిగా ‘ఒరే భీముడూ…’ అని పిలుస్తారు. వెంటనే సన్నగా వున్న ఒక వ్యక్తి ఎంటరవుతాడు. ఇక్కడ కామెడీ ఏంటంటే భీముడు అనగానే మనం లావుగా వున్నవాడిని ఊహిస్తాం. కానీ, సన్నగా, పీలగా వున్నవాడు రావడంతో నవ్వొచ్చేస్తుంది. ఇక ‘స్వర్ణ కమలం’ చిత్రంలో అప్పటివరకూ హీరోపై వున్న అభిప్రాయం మారి హీరోయిన్ కి హీరోపట్ల మంచి అభిప్రాయం ఏర్పడిన సన్నివేశం అద్భుతంగా వుంటుంది. మజ్జిగ తాగిన తరువాత హీరో గ్లాసు తీసుకొచ్చి హీరోయిన్ చేతికిచ్చినప్పుడు వారిద్దరి మధ్య కేవలం కళ్లతోనే సంభాషణ వుంటుంది. ఆ మాటకొస్తే ఈ చిత్రంలో భానుప్రియ కళ్లతో పలికించిన భావాలు అద్భుతం. ఈ చిత్రానికి భానుప్రియ నంది అవార్డును కూడా అందుకున్నారు.
ఇకపోతే, ‘శంకరాభరణం’ చిత్రంలో సోమయాజులు, మంజుభార్గవిల మధ్య సంభాషణలు తక్కువ, కళ్లతో మాట్టాడుకునేది ఎక్కువ. భారతీయ సినీ శిఖరం సత్యజిత్ రే ఒక మాటన్నారుట… ఏంటంటే, ఒక సన్నివేశం విషాదమైతే దాన్ని, సంతోషకరమైతే దాన్ని విజువల్ గా కూడా చూపించవచ్చునని. దీన్ని ఆయన తన చిత్రాలైన ‘పథేర్ పాంచాలి’ లాంటి చిత్రాల్లో చూపించారు కూడా. దర్శక దిగ్గజం సింగీతం శ్రీనివాసరావు టాకీ చిత్రాలు మొదలై రాజ్యమేలుతున్న రోజుల్లో సైతం ‘పుష్పక విమానం’ చిత్రాన్ని మూకీ చిత్రంగా రూపొందించి అభినందనలందుకున్నారు. ఏదేమైనా, సినిమా అనేది ప్రేక్షకుడికి అంతులేని వినోదాన్నందించే గొప్ప సాధనం. అందుకే, సినిమా కలకాలం వర్ధిల్లాలని కోరుకుందాం.
ప్రత్యేక కధనం by అన్నమయ్య