రాజకీయ పార్టీల మధ్య వైరుధ్యాలు అత్యంత సహజం. కానీ, పూర్వకాలంలో అయితే రాజకీయ పార్టీల మధ్య సైద్ధాంతికపరమైన అభిప్రాయ బేదాలు వుండేవి. ఇప్పటి పరిస్థితి గురించి చెప్పుకోవాలంటే దాదాపుగా ఏ పార్టీకైనా ఒక సిద్ధాంతమనేది వుండడం లేదు. ఈ మాటంటే రాజకీయ పార్టీల్లో వున్నవారికి కోపం కలగవచ్చు. కానీ, ఇది ముమ్మాటికీ నిజం. కేవలం అధికార పీఠాన్ని దక్కించుకోవడమనేదే వారి సిద్ధాంతంగా మారిపోయింది.
ఇక్కడ చెప్పుకోవలసిన మరో ముఖ్యమైన విషయమేంటంటే, అధికారంలో వున్న పార్టీ అన్నీ తప్పులే చేయదు, ప్రతిపక్షంలో వున్న పార్టీలు అన్నీ దురుద్దేశ పూర్వకమైన విమర్శలు చేయవు. కాకపోతే, ప్రతిపక్షంలో వున్న పార్టీలు అధికార పార్టీ చేసే మంచి పనుల్ని కూడా ఆహ్వానించవు, అధికార పార్టీ ప్రతిపక్షంవారు సహృదయంతో ఇచ్చే సలహాల్ని కూడా సీరియస్ గా తీసుకోదు. ‘మేం అధికారంలో వున్నాం కాబట్టి మేమే 100% కరెక్ట్’ అని వీరనుకుంటే, ‘ప్రజలకు అన్నీ ద్రోహం చేసే పనులే చేస్తోంది.’ అని అధికార పార్టీ పట్ల ఒక స్థిరమైన అభిప్రాయాన్ని కలిగి వుంటాయి ప్రతిపక్ష పార్టీలు.
ఇక ప్రస్తుత విషయానికొస్తే తెలంగాణలో అధికారంలో వున్న తెలంగాణ రాష్ట్ర సమితికీ, కేంద్రంలో అధికారంలో వున్న భారతీయ జనతా పార్టీకీ మధ్య ప్రత్యక్ష యుద్ధం జరుగుతోంది. టి.ఆర్.ఎస్. అధ్వానమైన పాలన కొనసాగిస్తోందని నిరూపించేందుకు బి.జె.పి., కేంద్రంలో బి.జె.పి. అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందనే ప్రచారంతో ప్రాంతీయ పార్టీలను కూడగట్టే ప్రయత్నంలో టి.ఆర్.ఎస్. వున్నాయి. మోదీ పాలన కె.సి.ఆర్. గుండెల్లో గుబులు పుట్టిస్తోందని బి.జె.పి. వారు అంటూంటే, తెలంగాణ టైగర్ కె.సి.ఆర్.ని ఓడించేందుకు ఇంతమంది కూడగట్టుకుని ప్రయత్నిస్తున్నారని టి.ఆర్.ఎస్. అంటున్నాయి. అయితే, తెలంగణలో పెద్దగా ప్రాబల్యం లేని బి.జె.పి. టి.ఆర్.ఎస్.ని వచ్చే ఎన్నికల్లో ఓడించేందుకు ఎలాంటి ఎత్తుగడలు వేస్తోంది, బి.జె.పి. రాష్ట్ర పాలనకు ఎంత మాత్రం తగదని ప్రజల ముందు నిరూపించేందుకు టి.ఆర్.ఎస్. ఎలాంటి పన్నాగాలు పన్నుతోందనే విషయాలు మాత్రం అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
ఏదేమైనా అంతిమ తీర్పునిచ్చేది మాత్రం ఓటరు. ఐదేళ్లూ ఓటరును సామాన్యుడిగానే చూసే రాజకీయ పార్టీలు, ఎన్నికల సమయంలో సామాన్యుడిని అసామాన్యమైన శక్తిగా చూస్తాయి. జరగబోయే ఎన్నికల్లోనూ తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకుంటుందనేది వేచి చూడాల్సిందే…!!
ప్రత్యేక కధనం by అన్నమయ్య