గల్లీ నుండి ఢిల్లీదాకా ఇప్పుడు దద్ధరిల్లేలా వినిపిస్తున్న పేరు… మునుగోడు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ నుండి బయటకు వచ్చి బి.జె.పి.లో చేరడం వల్ల మునుగోడుకు ఉప ఎన్నిక వచ్చిన విషయం తెలిసిందే. అయితే, సరిగ్గా వచ్చే సంవత్సరమే ఎన్నికలు వస్తూండడంతో ఈ ఉప ఎన్నికను రాజకీయ పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఢిల్లీ నుండి బి.జె.పి. పెద్దలు కూడా తరలి వచ్చి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాల్లో బిజీగా వున్నారు. ఎవరెన్ని మాటలు మాట్టాడుతున్నా ఓటర్ల మనసులో ఏముందో, తన తీర్పు ఎలా ఇస్తారోననే భయం అందరిలోనూ వుంటుంది.
ఎందుకంటే, బి.ఆర్.ఎస్.కీ, బి.జె.పి.కీ మధ్య మాటల యుద్ధం పెరిగిన నేపథ్యంలో ఇప్పుడు గెలుపు అనేది ఈ రెండు పార్టీలతో పాటు కాంగ్రెస్ కీ ఎంతో అవసరం. రాజగోపాల్ రెడ్డి పార్టీని వీడినప్పటికీ మునుగోడులో ప్రజల మద్ధతు తమకే వుందని నిరూపించుకోవడానికి కాంగ్రెస్ కి గెలుపు అవసరం. అలాగే, ఇంతకాలం కాంగ్రెస్ పార్టీలో వున్నందువల్ల కాదు, ప్రజల నుండి తనకు వ్యక్తిగత మద్ధతు వుందని నిరూపించుకోవడానికి రాజగోపాల్ రెడ్డికి గెలుపు అవసరం. ఇకపోతే, రెండు తెలుగు రాష్ట్రాల్లో సైతం పాగా వేయాలని చూస్తున్న బి.జె.పి. కూడా మునుగోడులో గెలుపు ఫలాన్ని అందుకోవడం ద్వారా తమ ప్రాబల్యాన్ని పెంచుకోవాలనే తీవ్రమైన ప్రయత్నాల్లో వుంది. ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్రంలో బి.ఆర్.ఎస్.పట్ల ప్రజలకు నమ్మకం పోయిందని నిరూపించాలన్నది బి.జె.పి., కాంగ్రెస్ ల ప్రధాన వ్యూహం.
ఇకపోతే, జాతీయ రాజకీయాల్లో జెండా పాతాలనే సంకల్పంతో బి.ఆర్.ఎస్.గా అవతరించిన టి.ఆర్.ఎస్.కి మునుగోడు గెలుపు అత్యంత ప్రధానమైన అంశం. ఎందుకంటే, ఒకవేళ ఓటమిపాలైతే ఇక్కడే గెలవలేనివారు జాతీయ స్థాయిలో ఏంచేయగలరనే విమర్శలు వెల్లువెత్తుతాయి. అయితే, ఏదేమైనా మునుగోడు ఓటర్ల నాడి ఎలా వుందనేది ముఖ్యమైన అంశం. రాజగోపాల్ రెడ్డి పార్టీ మారిన అంశాన్ని ఓటర్లు ఏ విధంగా పరిగణిస్తారు, దేశంలో క్రమంగా ప్రాభవాన్ని కోల్పోతున్న కాంగ్రెస్ పట్ల ఓటర్ల అభిప్రాయం ఎలా వుంది,
అలాగే, తెలంగాణ ఏర్పాటుకై తీవ్రంగా కృషి చేసి రెండుసార్లు అధికారంలోకి వచ్చి జాతీయ పార్టీగా అవతరించేందుకు కృషి చేస్తున్న బి.ఆర్.ఎస్.పట్ల ఓటర్ల నిర్ణయం ఏమిటి? అనే అంశాలు ప్రధానమైనవి. మునుగోడు ఉప ఎన్నికలో విజయం ఎవరిని వరిస్తుందీ, ఆ విజయం రాజకీయ పార్టీలపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందీ అన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే…!!
ప్రత్యేక కధనం By అన్నమయ్య