టీచర్, డాక్టర్, పోలీస్, లాయర్… ముఖ్యంగా ఈ నాలుగూ మన సొసైటీలో ఒక ప్రత్యేక హోదా కలిగిన స్థాయులు. అందుకే, ఈ నలుగురినీ అందరూ గౌరవిస్తారు. అయితే, మంచీ, చెడూ అన్నింట్లోనే వున్నట్టుగా విద్యార్థినీ విద్యార్థులను లైంగికంగా వేధించిన టీచర్లు వుంటున్నారు. కేవలం డబ్బు కోసమే వైద్యం చేసేవారున్నారు. అలాగే, భక్షక భటులుగా మారే పోలీసులూ, డబ్బు కోసం అన్యాయాన్ని న్యాయంగా చూపించే లాయర్లూ వున్నారు. అయినంత మాత్రాన అందరినీ ఒకే గాటనగట్టి చూడ్డం సరికాదనుకోండి. కానీ, ఏకంగా గ్యాంగ్‌స్టర్‌గా ఎదగాలన్న కోరికతో ఓ కానిస్టేబుల్ విధులకు డుమ్మా కొట్టి దొంగతనాలకు పాల్పడుతూ పట్టుబడడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. హైదరాబాద్‌లో జరిగిందీ ఘటన.
పోలీసుల కథనం ప్రకారం 2010 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుల్ ఈశ్వర్‌కు గ్యాంగ్‌స్టర్‌గా ఎదగాలన్న కోరిక ఉండేది. ఈ క్రమంలో సహచర కానిస్టేబుల్‌తో స్నేహం పెంచుకున్నాడు. గాంధీనగర్, చిక్కడపల్లి, ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్లలో ఇద్దరూ కలిసి పనిచేశారు. ఆ తర్వాత పలుకుబడి ఉపయోగించి టాస్క్‌ఫోర్స్‌కు బదిలీ చేయించుకున్నారు. గాంధీనగర్‌లో పనిచేస్తున్నప్పుడు ఓ పోలీసు అధికారి అండతో నేరస్తుల నుంచి అందినకాడికి గుంజడం మొదలు పెట్టారు. అయినప్పటికీ ఆశ చావకపోవడంతో ఇద్దరూ కలిసి ఏకంగా దొంగల ముఠాను ఏర్పాటు చేసి వారితో దొంగతనాలు చేయించి వాటాలు పంచుకోవడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో పంపకాల్లో తేడాల కారణంగా ఇద్దరి మధ్య విభేదాలు పొడసూపాయి. దీంతో ఇద్దరూ వేర్వేరుగా ముఠాలు ఏర్పాటు చేసుకున్నారు.
ఉత్తర మండలం పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న సమయంలో కానిస్టేబుల్ ఈశ్వర్ ఉదయం డ్యూటీకి వెళ్లి సంతకం పెట్టి బయటకు వచ్చేవాడు. ఆపై దొంగలను కలుసుకుని వారితో బేరసారాలకు దిగేవాడు. విషయం తెలిసిన ఇన్‌స్పెక్టర్ ప్రశ్నిస్తే బదిలీ చేయిస్తానని ఆయననే బెదిరించేవాడు. చిన్నపిల్లలు, మహిళలతో ముఠాలు ఏర్పాటు చేసి దందా నడిపేవాడు. చీరాల, హఫీజ్‌పేటలోని తన నివాసాల్లో ప్రస్తుతం నాలుగైదు ముఠాలకు బస ఏర్పాటు చేసి దొంగతనాలు చేయిస్తున్నట్టు తెలిసి పోలీసులు నివ్వెరపోయారు.
నల్గొండలో ఇటీవల అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరు చిన్నారులు, మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో ఈశ్వర్ బాగోతం బయటపడింది. సోమవారం కానిస్టేబుల్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అతడిపై ఇది వరకే సస్పెన్షన్లు, కేసులు ఉన్నా వెంటనే పోస్టింగులు సంపాదించడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు, ఈశ్వర్‌ను సస్పెండ్ చేయడంతోపాటు అతడికి సహకరించిన ముగ్గురు ఇన్‌స్పెక్టర్లు, ఇద్దరు ఎస్సైలపై పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ విచారణకు ఆదేశించినట్టు సమాచారం. క్రిమినల్స్ ఆర్ నాట్ బార్న్, దే ఆర్ మేడ్ అంటారు. పుట్టుకతో మనుషులంతా మంచివాళ్లే అయినా, పెరుగుతున్నకొద్దీ ఆలోచనా విధానం, చుట్టూ వున్న వాతావరణంవల్ల చెడు మార్గంలో నడుస్తారు.