బాపుగారి కార్టూన్లలో గెడ కర్ర లాంటి మొగుడు లావుపాటి పెళ్లానికి భయపడ్డం చూసి నవ్వుకుంటాం. అయితే, ఇక్కడ భార్యామణి లావుగా వుందో, సన్నగా వుందో తెలీదు గానీ ఆవిడగారి వీర బాదుడుకి తట్టుకోలేక మొగుడు వంద అడుగుల తాటి చెట్టెక్కి 32 రోజులు అక్కడే గడిపేశాడు. ఇదేమీ సినిమా కథ కాదండీ బాబూ… ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మౌ జిల్లాలోని బరసత్ పూర్ లో వుండే రాంప్రవేశ్ తో భార్య నిత్యం గొడవపడేది. రెచ్చిపోయి పిచ్చపిచ్చగా కొట్టేసేది. దీంతో తట్టుకోలేకపోయిన రాంప్రవేశ్ ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా వంద అడుగుల పొడవున్న తాటి చెట్టెక్కి కూర్చున్నాడు.
కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు ఎంత బతిమాలినా దిగలేదు. రాత్రుళ్లు కిందకు దిగి కాలకృత్యాలు తీర్చుకుని మళ్లె చెట్టెక్కేవాడు. తాడుతో బుట్టను కట్టి కిందకు వదలితే ఆహారాన్ని పైకి పంపించేవారు. అది తీసుకుని తినేవాడు. పైనే వుండేందుకు వీలుగా ఏర్పాట్లు చేసుకున్నాడు. విషయం అధికారులకు తెలియడంతో వారు అతడిని కిందికి దింపే ప్రయత్నం చేశారు.
ఈ క్రమంలో ప్రమాదశాత్తు అతడు కిందపడి గాయపడ్డాడు. దీంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భార్యలను కొట్టే భర్తల గురించి ఎక్కువే వింటూంటాం గానీ, భర్తను కొట్టే భార్య గురించి చాలా చాలా తక్కువగా వింటాం. తప్పు అనేది ఎవరు చేసినా తప్పే. భార్య భర్తను కొట్టినా, భర్త భార్యను కొట్టినా తప్పే గదండీ…!!