Crime శారీరక సంబంధంతోనే పెద్దలు వివాహం చేస్తారని నమ్మించి ఓ యువతిని మోసం చేశాడో ప్రబుద్ధుడు. దీంతో మనస్తాపంతో చెందిన ఆ యువతి ఎలుకలమందు తాగి ఆత్మహత్య చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. పశ్చిమగోదావరి నూజివీడు పట్టణంలోని స్టేషన్‌తోటకు చెందిన రాణిమేకల రాణి(20) ఇంటర్ వరకు చదివింది. అదే ప్రాంతానికి చెందిన డిగ్రీ ఫైనలియర్ చదువుతున్న కొండా ప్రదీప్‌కుమార్, రాణి ఆరునెలలుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం రెండు నెలల క్రితం వారి ఇళ్లల్లో తెలిసి వీరి ప్రేమను అంగీకరించలేదు. దీంతో వీరు సైతం మాట్లాడుకోవడం లేదు. ఈ నేపధ్యంలో ఆగస్టు మొదటి వారంలో ప్రదీప్ మళ్లీ రాణితో మాటలు కలిపి ఇద్దరం శారీరకంగా ఒక్కటైతే పెద్దలు కచ్ఛితంగా పెళ్లికి అంగీకరిస్తారని చెప్పి నమ్మించాడు. 10వ తేదీన యువతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో శారీరకంగా ఒక్కటయ్యారు.
మరుసటి రోజు నుంచి ప్రదీప్ యువతితో మాట్లాడటం మానేశాడు. మహిళ భయంతో 27న తన తల్లి మంజులకు జరిగిన విషయాన్ని చెప్పింది. ఆమె పెద్దలతో చెప్పగా, వారు ప్రదీప్, అతని తల్లిని వివాహం చేసుకోవాలని అడగగా నిరాకరించారు. దీంతో 28న ఇంట్లో ఎవరూ లేని సమయంలో రాణి ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. విషయాన్ని తల్లికి చెప్పగా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.