సాధారణంగా జీవితంలో ఎవరికైనా ఒకేసారి పెళ్లి జరుగుతుంది. కాలం మారుతున్నకొద్దీ ఒకటికి మించి పెళ్లిళ్లు చేసుకునేవారి సంఖ్య పెరిగింది. కానీ, మహా అయితే రెండో, మూడో పెళ్లిళ్లు చేసుకుంటారు. ఆరు పెళ్లిళ్ల వరకూ చేసుకున్నవారి గురించి కూడా మనం విన్నాం. అయితే, ఒకటి కాదు, రెండు కాదు… ఏకంగా 87 పెళ్లిళ్లు చేసుకుని 88వ పెళ్లికి రెడీ అయిన ప్రబుద్ధుడి గురించి మీరెప్పుడైనా విన్నారా?
అతడి పేరు కాన్… ఇండోనేసియాలోని వెస్ట్ జావాకు చెందిన ఆయన వయసు 61 సంవత్సరాలు. 14 సంవత్సరాల వయసులో తన కంటే రెండేళ్లు పెద్దదైన అమ్మాయిని పెళ్లాడిన కాన్.. ఇప్పుడు మరోమారు వార్తల్లోకి ఎక్కాడు. 14 ఏళ్లకే వివాహ బంధంలోకి అడగుపెట్టిన ఆయన పెళ్లిళ్ల పరంపర బ్రేక్ లేకుండా కొనసాగింది. అలా ఇప్పటి వరకు 87 పెళ్లిళ్లు చేసుకున్న కాన్.. 88వ పెళ్లికి రెడీ అవుతున్నాడు. నమ్మశక్యం కాకున్నా ఇది నిజం. 14 ఏళ్లకే పెళ్లి చేసుకున్నప్పటికీ అతడి ప్రవర్తన నచ్చకపోవడంతో రెండేళ్లకే భార్య అతడికి టాటా చెప్పేసి వెళ్లిపోయింది. అది మొదలు వివాహాలు చేసుకోవడం, విడిపోవడం.. సంవత్సరాల తరబడి ఇదే తంతు. ఇలా 60 ఏళ్లలో ఏకంగా 87 వివాహాలు చేసుకున్నాడు.
ఇప్పుడు ముచ్చటగా మరో పెళ్లికి రెడీ అయ్యాడు. ఇక్కడ ఇంకో ఆశ్చర్యకరమైన విషయం కూడా ఉంది. 88వ పెళ్లి కూతురు మరెవరో కాదు.. అతడి 86వ భార్యే. మనస్పర్థల కారణంగా విడిపోయిన ఆమెనే మళ్లీ పెళ్లాడాలని కాన్ నిర్ణయించుకున్నాడు. మరి అతడి పెళ్లిళ్ల పర్వానికి ఇప్పటికైనా ఫుల్‌స్టాప్ పడుతుందో? లేదో? వేచి చూడాల్సిందే. అన్నట్టు.. అతడికి ‘ప్లేబోయ్ కింగ్’ అనే నిక్ నేమ్ కూడా ఉందండోయ్! 88వ పెళ్లికి మనల్ని పిలుస్తాడేమో చూద్దాం. మనమూ వెళ్లి పెళ్లి విందు ఆరగించి వద్దామంటారా?