ఒక్కోసారి చిన్న పొరపాటు పెద్ద నష్టానికి దారి తీస్తుంది. అది పూడ్చలేనిదిగా మిగిలిపోతుంది. ఆ తర్వాత ఏమీ చేయలేం. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్న చందాన ఏర్పడుతుంది పరిస్థితి. సరిగ్గా ఇలాంటి పరిస్థితే ఐదుగురి ప్రాణాల్ని హరించింది.
టీ పొడి అనుకుని వరిపంటలో వినియోగించే పిచికారీ మందును పాలల్లో వేసి మరగబెట్టడంతో అది తాగిన ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురిలోని నాగ్లా కన్హై లో జరిగిందీ విషాద ఘటన. శివానందన్ భార్య రోజులానే టీ పెట్టి ఇంట్లో వారికి ఇచ్చింది. అది తాగిన 35 ఏళ్ల వయసుగల శివానందన్, అతడి కుమారులు ఆరేళ్ల శివంగ్, ఐదేళ్ల దివ్యాన్ష్, యాభై ఐదేళ్ల మామ రవీంద్రసింగ్ తో పాటు నలభై ఐదేళ్ల పొరుగింటి వ్యక్తి సోబ్రాన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే వారిని జిల్లా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే రవీంద్ర సింగ్, శివంగ్, దివ్యాన్ష్‌లు మృతి చెందారు. సోబ్రాన్, శివానంద్‌ల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని అక్కడి నుంచి సైఫాయి ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వారిద్దరూ ప్రాణాలు కోల్పోయారు.
శివానంద్ భార్య టీ కాస్తున్న సమయంలో వరిపంటలో పిచికారీ చేసే మందును టీపొడిగా భావించి పాలలో కలిపి టీ తయారు చేసినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. పాలలో కలిపిన పిచికారీ మందు విషపూరితం కావడంతో అది తాగిన వారు మరణించినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన స్థానికంగానే కాదు, విన్నవారందరి మనసునూ కలచి వేస్తుంది. నిజంగా దారుణం గదూ…!!