నేచురల్ స్టార్ నాని- నజ్రియా నజీమ్ జంటగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ ‘అంటే సుందరానికీ’. జూన్ 10న ప్రపంచవ్యాప్తంగా పేక్షకుల ముందుకు రాబోతుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా విచ్చేసిన ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ లో చిత్ర బృందంతో పాటు దర్శకుడు సుకుమార్, గోపి చంద్ మలినేని, హరీష్ శంకర్, బుచ్చిబాబు, హీరోయిన్ నివేదా థామస్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భం గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఈ వేడుకకు వచ్చిన ప్రేక్షకులకు అభిమానులకు కృతజ్ఞతలు. అభిమానులు ఉత్సాహం లేకపోతే ఇలాంటి వేడుకకి అందం వుండదు. ‘అంటే సుందరానికీ’ వేడుకకి ఆహ్వానించిన మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ గారికి, నవీన్ గారికి ధన్యవాదాలు. నాని గారి నటనే కాకుండా ఆయన వ్యక్తిత్వం అంటే నాకు ఎంతో గౌరవం. నాని గారు గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. ఆయనికి భగవంతుడు గొప్ప విజయాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఈ చిత్రంలో కథానాయికగా నటించిన నజ్రియా గారిని తెలుగు చిత్ర పరిశ్రమ కి మనస్పూర్తిగా ఆహ్వానం పలుకుతున్నాను. సినిమాకి వెన్నెముక లాంటి దర్శకుడు వివేక్ ఆత్రేయ గారికి మనస్పూర్తిగా అభినందనలు. ఈ సినిమాని నేనూ చూడాలని ఆశిస్తున్నా.
నరేష్ గారు, ఆయన నటన అంటే నాకు ఎంతో ఇష్టం. అలాగే రోహిణి గారికి, మేడం నదియా గారికి అభినందనలు. ఈ చిత్రంలో నటీనటులు, సాంకేతిక విభాగం అంతటికీ నా అభినందనలు. మంచి సంగీతం అందించిన వివేక్ సాగర్ కి అభినందనలు. ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించాలని కోరుకుంటున్నాను. తెలుగు చిత్ర పరిశ్రమ ఒక్కరి సొత్తుకాదు అందరి సొత్తు. ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా నిలబడే ధైర్యం అభిమానులు. ప్రేక్షకులు, తెలుగు చిత్ర పరిశ్రమ ఇచ్చింది. రాజకీయంగా భిన్నమైన ఆలోచనలు వున్నప్పటికీ సినిమా వేరు రాజకీయం వేరు. కళకి కులం మతం ప్రాంతాలు వుండవు. కేరళ నుండి వచ్చిన నజ్రియా గారు, ముంబై నుండి వచ్చిన నదియా గారు.. ఇలా విభిన్నమైన ప్రాంతాలు నుండి వచ్చిన కళాకారులంతా కలసి అంటే సుందరానికీ సినిమా చేశారు. ఇంత మంది కలిస్తేనే ఇంతమందిని అలరించగలం. అందుకే తెలుగు చిత్ర పరిశ్రమ అంటే అపారమైన గౌరవం. ఇంతగొప్ప పరిశ్రమకి మోకరిల్లుతూ.. అంటే సుందరానికీ ఘన విజయం సాధించి, అందరిమెప్పు పొందాలని కోరుకుంటున్నాను. నానిగారికి మా ఇంట్లో కూడా చాలా మంది అభిమానులు వున్నారు. విలక్షణ నటుడు నాని. గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి. ఆయన మరిన్ని ఘన విజయాలు సాధించాలి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్ సినిమా చేయబోతున్నాం. అంటే సుందరానికీ అద్భుతమైన విజయం సాధించాలని మరోసారి మనస్పూర్తిగా కోరుకుంటున్నాను” అన్నారు.