పెళ్లి అనేది జీవితంలో వచ్చే ఒకే ఒక్క శుభ సందర్భం. కాకపోతే, అది ఎవరికీ అంటే సంప్రదాయబద్దంగా జీవితంలో ఒకే పెళ్లి చేసుకునేవారికి. కానీ, క్రికెట్ మ్యాచుల్లా ఒకదాని వెనక ఒకటి వరసగా ఐదు పెళ్లిళ్లు చేసుకున్న పెద్ద మనిషిని ఏమనాలీ? మీ ఇష్టం. జనరల్ గా అన్నట్టుగా నిత్య పెళ్లి కొడుకు అనో, మిస్టర్ పెళ్లి కొడుకో అనేయండి. ముందైతే ఈ మహానుభావుడి ఆటో బయోగ్రఫీని ఓసారి చూసేద్దాం.
సదరు అంకుల్ పేరు షౌకత్. శుబ్బరంగా యాభై ఆరేళ్ల వయసున్నాడు. ఈ సారు ఫ్యామిలీ స్టోరీ వింటే మన కళ్లు తిరుగుతాయి. పదిమంది కుమార్తెలు, ఒక కుమారుడు, మనవలు, మనవరాళ్లు కలిపి సరదాగా ఓ యాభై ఒక్క మంది వున్నారు. ఇంకా ఇలాంటి కుటుంబాలు చాలానే వున్నాయని కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. ఈ ఆదర్శరావు ఈ మధ్యే సరదాగా మరో పెళ్లి… అంటే ఐదో పెళ్లి చేసుకున్నాడు.
ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే, ఓవైపు కూతుళ్ల పెళ్లిళ్లు జరుగుతుండగా మన విక్రమార్కుడు ఐదో వధువు మెడలో మూడు ముళ్లు వేశాడు. ఆ ఛాయాగ్రాహక శిఖామణి ఎవరో గానీ, ఈ వీడియోని యూట్యూబ్ లో పెట్టడంతో అది కాస్తా వైరల్ అయి కూర్చుంది. ఇంతకీ ఈ అంకుల్ ఎక్కడంటాడూ అనేగా మీ ధర్మ సందేహం…! పాకిస్తాన్ లోని ఇస్లామాబాద్ లో వుంటాడు. ముందు భార్యలు అనారోగ్యం, ప్రమాదం కారణాలవల్ల చనిపోయారు. అయితే, పదిమంది కూతుళ్లూ, ఒక కొడుకూ తండ్రితోనే వుంటున్నారు. వారందరికీ కలిపి నలభై మంది పిల్లలు కూడా వున్నారు. ఈ మధ్యే చివరి ఇద్దరు కుమార్తెలకు మంచి సంబంధాలు కుదిరాయి.
ఇక్కడ మరో ట్విస్ట్ వుంది. అదేంటంటే, తమకు పెళ్లిళ్లై అత్తారిళ్లకు వెళ్లిపోతే తండ్రిని చూసుకునేదెవరని ఆలోచించిన కూతుళ్లే తండ్రిని ఐదో పెళ్లికి ఒప్పించారుట. వారే స్వయంగా ‘మా నాన్నకు పెళ్లి’ టైటిల్ లా స్వయంగా ఓ వధువును చూసి తమ పెళ్లిళ్ల సందర్భంలోనే తండ్రికి ఐదో పెళ్లి జరిపించారు. గత సంవత్సరం యాసిర్ షమీ అనే యూట్యూబర్ ఐదో పెళ్లి నేపథ్యంలో షౌకత్ ను ఇంటర్వ్యూ చేశాడు. ఆ వీడియో వైరల్ అవుతుండడంతో అంకుల్ పెళ్లిళ్ల వ్యవహారం ప్రపంచానికి తెలిసిపోయింది.