సాధారణంగా ఇంట్లో అమ్మానాన్నలు ‘లే… లేచి స్నానం చెయ్యి.’ అని మాటిమాటికీ అంటూంటే విసుగొస్తుంది గదూ…! ‘వెళ్తాలే’ అని విసుక్కుంటూంటారు చాలామంది. అలా అనగా అనగా అప్పుడు లేచి స్నానానికి వెళ్తారు. అయితే, ఉదయం ఏ సమయంలో చేసే స్నానాన్ని ఏమంటారూ, ఏ సమయంలో స్నానం చేయడం మంచిదీ అనే విశేషాలూ మనకు వున్నాయి. ఓ పెద్దాయన మాత్రం పరిశుభ్రంగా వుంటే అనారోగ్యాల పాలవుతామనే విచిత్రంగా ఆలోచించి ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా అరవై ఏళ్లపాటు స్నానమే మానేశాడు. అయినా శుబ్బరంగా బతికేశాడు. అంతేనా, చనిపోయిన జంతువుల మాంసాన్ని తింటూ బతికేశాడు.
ఇరాన్ కు చెందిన ఈ పెద్దాయన పేరు అమౌ హాజీ. 2013వ సంవత్సరంలో హాజీపై డాక్యుమెంటరీ కూడా చేశారుట…! ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేంటంటే ప్రపంచంలో దేనికి పేరొస్తుందో అర్థంగాదు. ప్రపంచంలోనే అత్యంత మురికి వ్యక్తిగా పేరు పొందాడు అమౌ హాజీ. ఆయన వయసు 94 సంవత్సరాలు. అర దశాబ్దానికిపైగా స్నానానికి దూరంగా ఉన్న అమౌ హాజీ అనారోగ్యం బారినపడకుండానే మృతి చెందినట్టు ఇరాన్ అధికారిక మీడియా తెలిపింది. ఇరాన్ దక్షిణ ప్రావిన్స్ అయిన ఫార్స్‌లోని డెజ్గా గ్రామంలో మృతి చెందాడు. ఆయనకు కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోవడంతో గ్రామస్థులే దయతలచి ఆయన తలదాచుకునేందుకు చిన్న ఆవాసాన్ని ఏర్పాటు చేశారు. పరిశుభ్రంగా ఉంటే అనారోగ్యం బారినపడతానన్న భయంతో స్నానాన్ని మానేసిన ఆయన సబ్బుతో ముఖం, కాళ్లు చేతులు కూడా ఎప్పుడూ కడుక్కోలేదు. చనిపోయిన మూగజీవాలను తింటూ బతికేవాడు.
ఒకేసారి నాలుగైదు సిగరెట్లను ఊదిపడేసేవాడు. స్నానం లేకుండా వింత జీవితాన్ని గడుపుతున్న హాజీపై 2013లో ఓ డాక్యుమెంటరీ కూడా వచ్చింది. 60 ఏళ్లుగా స్నానానికి దూరమై మురికితో పూర్తిగా దుమ్ముకొట్టుకుపోయిన హాజీకి ఇటీవల గ్రామస్థులందరూ కలిసి బలవంతంగా స్నానం చేయించారు. అది జరిగిన కొన్ని రోజులకే ఆయన మృతి చెందడం గమనార్హం. యువకుడిగా ఉన్నప్పుడు అతడికి ఎదురైన పలు ఘటనలు అతడిని స్నానానికి దూరం చేశాయని గ్రామస్థులు పేర్కొన్నారు. హాజీ మరణంతో జీవితకాలంలో అత్యధిక కాలం స్నానం చేయని వ్యక్తి రికార్డు ఇప్పుడు అనధికారికంగా భారతీయుడి సొంతమైంది. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి శివారులోని ఓ గ్రామానికి చెందిన అరవై మూడేళ్ల కైలాశ్ కాలౌ సింగ్ 30 ఏళ్లుగా స్నానానికి దూరంగా ఉన్నట్టు 2009లో హిందూస్థాన్ టైమ్స్ ఓ కథనంలో పేర్కొంది.
దీనిని బట్టి ఇప్పటికి 44 ఏళ్లుగా ఆయన స్నానానికి దూరంగా ఉన్నాడు. దేశం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే ప్రయత్నంలోనే తాను స్నానానికి దూరంగా ఉన్నట్టు అప్పట్లో ఆయన పేర్కొన్నారు. కలౌ సింగ్ నీళ్లతో స్నానానికి బదులు అగ్నిస్నానం చేసేవాడని గ్రామస్థులు అంటారు. ప్రతిరోజూ సాయంత్రం గ్రామస్థులు తన వద్దకు వచ్చి గుమిగూడినప్పుడు భోగిమంటలు వెలిగించి గంజాయి తాగుతూ ఒంటికాలిపై నిల్చుని శివుడిని ప్రార్థించేవాడు. నీటితో స్నానం చేసినట్టుగానే అగ్నిస్నానం వల్ల మన శరీరంలోని బ్యాక్టీరియా నశిస్తుందని, ఇన్ఫెక్షన్లు తొలగిపోతాయని కలౌ సింగ్ పేర్కొన్నట్టు అప్పట్లో హిందూస్థాన్ టైమ్స్ పేర్కొంది. నిజంగా ఇలాంటివి ఆశ్చర్యం గొలిపే సంఘటనలు గదూ…!!