పాలు, పెరుగు, పప్పులతో సహా కోట్ల మంది ఆహారమైన నిత్యావసరాలన్నింటిపై ఎడాపెడా పన్నులేస్తున్న కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం, కార్పొరేట్లపై మాత్రం ఎక్కడలేని కరుణ చూపుతున్నది. కార్పొరేట్ కంపెనీలకు వందల కోట్ల లబ్ధి చేకూరేలా బుధవారం హఠాత్తుగా పన్నులను ఎత్తేసింది. కొన్ని ఉత్పత్తులపై పన్ను తగ్గించింది. ప్రభుత్వ నిర్ణయంతో ప్రపంచ శ్రీమంతుల్లో ఒకరైన ముకేశ్ అంబానీ వంటివారికి వందల కోట్ల ఆదాయం సమకూరనున్నది. పెట్రోల్, డీజిల్ ఎగుమతులు, క్రూడ్ ఆయిల్ ఉత్పత్తిపై జూలై 1న కేంద్రం విండ్‌ఫాల్ ట్యాక్స్ విధించిన సంగతి తెలిసిందే. ఈ పన్ను ప్రధానంగా రిలయన్స్, వేదాంత (సబ్సిడరీ కెయిర్న్ ఎనర్జీ), ఓఎన్జీసీ, తదితర కంపెనీలు అసాధారణంగా ఆర్జిస్తున్న లాభాలపై ప్రభావం చూపింది. లీటర్ పెట్రోల్ ఎగుమతులపై విధించిన రూ.6 పన్నును ఇప్పుడు పూర్తిగా ఎత్తివేయగా, డీజిల్‌పై ఎగుమతి లాభాల పన్నును రూ.13 నుంచి రూ.11కు, విమాన ఇంధనం (ఏటీఎఫ్)పై రూ.6 నుంచి రూ.4కు తగ్గించింది. టన్ను క్రూడ్ ఉత్పత్తిపై ట్యాక్స్‌ను రూ.23,250 నుంచి రూ.17,000కు తగ్గించింది. కార్పొరేట్లపై మోదీ ప్రభుత్వం అపార కరుణ చూపిస్తున్నదనడానికి ఇదే నిదర్శనమని విశ్లేషకులు విమర్శిస్తున్నారు.
మూడు వారాలకే రద్దు
పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో ప్రజలు సతమతమవుతుంటే ఎన్నో నెలలపాటు స్పందించని నరేంద్రమోదీ ప్రభుత్వం, కార్పొరేట్ల పెట్రోల్ పన్నులను మాత్రం మూడు వారాలైనా గడవక ముందే రద్దుచేయటం గమనార్హం. క్రూడ్ ధరలు తగ్గడంతో కంపెనీల లాభాలకు గండిపడిపోతున్నదంటూ ఆగమేఘాల మీద పన్నులు ఎత్తివేసిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. లీటర్ పెట్రోల్ రూ.90 స్థాయి నుంచి రూ.115 చేరి ప్రజలు గగ్గోలు పెడుతున్నా మే నెల వరకూ కేందం నిమ్మకునీరెత్తినట్టు ఉండిపోయింది. కానీ క్రూడ్ ఆయిల్ ధర 115-120 డాలర్లకు చేరడంతో కంపెనీలపై విధించిన విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను మూడువారాలకే ఎత్తివేసింది. వాస్తవానికి జూన్ నెలలో క్రూడ్ ఆయిల్ బ్యారల్ సగటు ధర 116 డాలర్లు. జూలైలో మూడు వారాల సగటు 105.47 డాలర్లు. సాధారణంగా హెచ్చుతగ్గులకు లోనయ్యే ముడి చమురు ధర మళ్లీ వెంటనే పెరగదనే గ్యారంటీ ఉన్నదా? అందుకే కంపెనీలపై పన్నులను తగ్గించారా? అలా అయితే దేశంలో పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను ఎందుకు తగ్గించడం లేదు? అని ప్రజలు విరుచుకుపడుతున్నారు.
ఇదే మొదటిసారి కాదు
ప్రజల మీద ఎప్పటికప్పుడు పన్నుల భారాన్ని మోపుతున్న మోదీ ప్రభుత్వం, కార్పొరేట్ల దగ్గర మోకరిల్లడం ఇదే మొదటిసారి కాదు. కొవిడ్‌కు ముందు కూడా ఏ కారణం లేకుండానే కార్పొరేట్ పన్నును ఒకేసారి 30 నుంచి 25 శాతానికి తగ్గించింది. వేతన జీవుల ఆదాయంపై పన్ను రేట్లు మాత్రం యథాతథంగా ఉంచింది. 2015 నుంచి పెట్రోల్, డీజిల్ ఎక్సైజ్ పన్నును అదేపనిగా పెంచుతూ, దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుదలకు కారణమయ్యింది. ఇక జీఎస్టీ పేరుతో విధించే పన్నులకైతే అంతూపొంతూ లేదు. ఇలా ధరాభారంతో సామాన్యుడు విలవిలలాడుతుంటే ప్రజా సంక్షేమం గాలికొదిలి, హడావుడిగా కార్పొరేట్ లాభాలకు కొమ్ముకాయాల్సిన అవసరం ఏమిటని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.