Actress Hansika : దేశముదురు సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైంది హన్సిక. ఆ తర్వాత ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. కాగా గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో హీరోయిన్ హన్సిక పెళ్లి వార్తలు వైరలవుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ ముద్దుగుమ్మ ఎంగెజ్మెంట్ జరిగిందని… త్వరలోనే అత్యంత వైభవంగా వివాహం జరగనుందంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇక ఇప్పుడు తాజాగా పెళ్లి గురించి వస్తున్నన్యూస్ గురించి తన పోస్ట్ తో అందరికీ సమాధానం ఇచ్చేసింది హన్సిక.
ఇటీవల తాను డిసెంబర్లో పెళ్లి చేసుకోబోతున్నానంటూ హింట్ ఇచ్చిన ఈ భామ… ఇప్పుడు తనకు కాబోయే భర్తను సోషల్ మీడియా వేదికగా పరిచయం చేసింది. ఇంస్టా వేదికగా తన స్నేహితుడు, వ్యాపార భాగస్వామి అయిన సోహైల్‌ను వివాహం చేసుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఈఫిల్ టవర్ ముందు మ్యారీ మీ అంటూ ప్రపోజ్ చేసిన ఫోటోస్ ను పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోస్ నెట్టింట వైరలవుతుండగా… అభిమానులతో పాటు, సినీ ప్రముఖులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
కాగా జైపూర్ లోని రాజకోటలో డిసెంబర్ 4 న కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం వైభవంగా జరగనుంది. డిసెంబర్ 2 నుంచి వివాహ వేడుకలు ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 2న సూఫీ రాత్రితో ప్రీ వెడ్డింగ్ వేడుకలు, డిసెంబర్ 3న మెహందీ, సంగీత్ వేడుకలు జరుగుతాయి. ఇక ఆమె వివాహం గురించి త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని తెలుస్తుంది. చూడాలి మరి ఈ అమ్మడు ఎప్పుడు ఆ శుభవార్తను కూడా ప్రకటిస్తుందో అని…