ఎయిర్ పోర్టులో టేకాఫ్ తీసుకున్న విమానం కొంతదూరం ప్రయాణ చేశాక హఠాత్తుగా గాల్లోనే ఆగిపోతే ఎట్టా వుంటుంది? అందులో వున్నవాళ్లకి గుండాగిపోదూ…! విమానంలో వున్నవారి సంగతి తెలీదు గానీ చూసినవారు మాత్రం ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టి చూస్తూండిపోయారు. అమెరికాలో జరిగిన ఈ సంఘటనను జెన్ని ఫెరిరోనియోట్ అనే టిక్ టాకర్ వీడియో తీసి ఆన్ లైన్ లో పెట్టడంతో అది కాస్తా వైరల్ అయింది. అయితే, విమానం ఆగిపోయినప్పటికీ కదులుతున్నట్టుగా శబ్దం రావడమేంటో ఎవరికీ అర్థం కాలేదు. ఈ వీడియోను రెడ్డిట్ అనే వెబ్ సైట్లో పోస్ట్ చేసి ఇలా ఎందుకు జరిగిందో మీరేమైనా చెప్పగలరాని ప్రశ్నిస్తే సమాధానాలు పెద్ద సంఖ్యలోనే వచ్చాయి.
‘ఆకాశంలో అంత ఎత్తున గాలి అత్యంత వేగంగా వీస్తుంటుంది. ఒక్కోసారి అలా వీచినప్పుడు విమానం వేగం బాగా తగ్గిపోతుంది. గాలి వేగం తగ్గాక గానీ విమానం వేగం పుంజుకోదు. అలాంటి సమయంలో మనకు అది కదలకుండా వున్నట్టు కనిపిస్తుంది.’ అని ఒకరు, ‘ఎదురుగాలి వేగానికి తోడు విమానానికి పైన మేఘాలు దాదాపు అదే వేగంతో పయనిస్తుండటం వల్ల విమానం ముందుకు కదిలినా కదలనట్టు అనిపిస్తుంది.’ అని మరొకరు సమాధానాలిచ్చారు. ‘ఇది చూడటానికి సరదాగా కనిపిస్తుంది గానీ, ఆ విమానం నడుపుతున్న వారికి మాత్రం పెద్ద చాలెంజ్ ఎదురైనట్టే. విమానాన్ని కంట్రోల్ లో ఉంచడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది.’ అని వైమానిక రంగ నిపుణులు పేర్కొన్నారు.