రానురాను కాలుష్యం కోరలు చాస్తోంది. మనిషి కాలుష్యం కోరలకు బలవుతున్నాడు. అయితే, తాను కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్టుగా కాలుష్యం పెరిగిపోతూండడానికి కారణం మనిషే… దేశంలో ఈ ఏడాది కాలుష్యం తీవ్రంగా పెరిగిపోయిందని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు నివేదిక వెల్లడించింది. వాహనాలు వెలువరించే పొగతో పాటు పంట పొలాల్లోని వ్యర్థాలను తగలబెట్టడం వంటి చర్యలతో వాయు కాలుష్యం పెరిగిపోతోందని తెలిపింది. మనం పీల్చే గాలి నాణ్యత బాగా పడిపోయిందని బోర్డు తన నివేదికలో ఆందోళన వ్యక్తంచేసింది. నగరాల్లో కాలుష్యం తీవ్రత ఎక్కువగా ఉందని, ఈ ఏడాది దేశంలోనే అత్యంత కాలుష్య నగరంగా బీహార్ లోని కతిహార్ నిలిచిందని పేర్కొంది. కతిహార్ లో గాలి నాణ్యత(ఏక్యూఐ) 360 పాయింట్లకు చేరిందని కాలుష్య నియంత్రణ బోర్డు నివేదికలో పేర్కొంది.
దీని తర్వాతి స్థానంలో ఢిల్లీ (354), నోయిడా(328), ఘజియాబాద్(304) నగరాలు ఉన్నాయని తెలిపింది. ఇక, బెగుసరాయ్, బల్లాబ్ గఢ్, ఫరీదాబాద్, కైతాల్, గురుగ్రామ్, గ్వాలియర్ నగరాలు కూడా అత్యంత కాలుష్య నగరాలని ఈ నివేదిక తేల్చింది. పంజాబ్ లో పంట పొలాల వ్యర్థాల కాల్చివేతలు పెరుగుతున్నాయని భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ(ఐఏఆర్ఐ) ఆందోళన వ్యక్తం చేసింది. ఇటీవల ఒక్క రోజులోనే పంట వ్యర్థాల కాల్చివేత ఘటనలు మొత్తం 3,634 గుర్తించినట్లు తెలిపింది.
వాయు కాలుష్యంతో మన ఆరోగ్యానికి ముప్పు తప్పదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కలుషిత గాలిని పీల్చడం వల్ల ఊపిరితిత్తులకు సంబంధించిన అనారోగ్యాల బారిన పడక తప్పదంటున్నారు. దీనివల్ల అకాల మరణం పొందే ముప్పు కూడా ఎక్కువవుతుందని హెచ్చరించారు. ఒక్క 2017 ఏడాదిలోనే మన దేశంలో వాయు కాలుష్యం వల్ల అకాల మరణం పొందిన వారి సంఖ్య 12 లక్షలకు పైనేనని వివరించారు. ఏదేమైనా, ఇప్పటికైనా కాలుష్య నియంత్రణకు తీవ్రంగా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా వుంది.