Anand Deverakonda-Rashmika : రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) తమ్ముడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda) తనదైన పంథాలో సినిమాలు చేసుకుంటూ ఓ గుర్తింపు తెచ్చుకునే పనిలో ఉన్నాడు. ఆయన నటిస్తున్న తాజా సినిమా బేబీ. రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వైష్ణవి చైతన్య (Vaishnavi chaitanya) హీరోయిన్. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. జూలై 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాల్లో వేగం పెంచింది. అందులో భాగంగా పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆనంద్‌కు ఓ ఇబ్బందికర ప్రశ్న ఎదురైంది. బేబీ సినిమాలోని ఓ పాటను రష్మిక (Rashmika Mandanna) విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో అభిమానులు ఆమెను వదినా అని పిలిచారు కదా అని ఓ విలేకరి ఆనంద్ దేవరకొండను అడిగాడు. ఆనంద్ దేవరకొండ ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు. “నో.. నేను దీన్ని ఇక్కడితో ఆపేస్తాను.” అని అన్నాడు.
చిత్ర కథ తనకు బాగా నచ్చిందని, సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు ఆనంద్ దేవరకొండ. సినిమా నుంచి ఓ పోస్టర్ డిలీట్ చేయడంపైనా కూడా స్పందించాడు. చిత్ర విడుదల తేదీని ప్రకటిస్తూ ఓ పోస్టర్‌ను విడుదల చేశాము. అయితే.. దానిపై మిక్స్‌డ్ రెస్పాన్స్ వచ్చింది. ఇదేం పోస్టర్ అని కొందరు కామెంట్ చేశారు. నెగెటివ్ ఎందుకు అని ఆ పోస్టర్‌ను డిలీట్ చేసినట్లు చెప్పుకొచ్చాడు.
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న లు ప్రేమించుకుంటున్నారు అంటూ ఆ మధ్య కాలంలో సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. త్వరలోనే పెళ్లి చేసుకుంటారు అన్న టాక్ కూడా వినిపించింది. అయితే దీనిపై అటు విజయ్ గానీ ఇటు రష్మిక గానీ స్పందించలేదు.





















