* ఆంజనేయుడు పుట్టింది తిరుమలే
* శ్రీరామ నవమి నాడు ఆధారాలతో చూపించనున్న టీటీడీ
* అంజనాద్రే ఆంజనేయుడి జన్మస్థలంః పండిత కమిటీ
* డిసెంబర్లో పండితులతో కమిటీ వేసిన టీటీడీ
* అంజనాద్రిలోనే ఆంజనేయుడు జన్మించాడనటానికి బలమైన ఆధారాలు
* శాస్త్రీయ ఆధారాలు సేకరించామంటున్న టీటీడీ ఈవో జవహార్ రెడ్డి
ఆంజనేయుడు ఎక్కడ పుట్టాడు? అన్నదొక చర్చ. తిరుమల అంజనాద్రిలో పుట్టాడని కొందరు. కాదు.. హంపీలో పుట్టాడని కొందరు.. అదేం లేదు మా ఉత్తరాదిలో పుట్టాడని మరికొందరు. లేదు మా గోదారి జిల్లాల్లో అని ఇంకొందరు. హనుమంతుడి జన్మస్థలం మా ప్రాంతమంటే మా ప్రాంతమని కొంత కాలంగా వివాదం నడుస్తోంది. ఈ అంశంపై ఒక క్లారిటీ దొరికేలా ఉంది.
ఎందుకంటే ఆంజనేయుడు అంజనాద్రి వాసుడా? కాదా? అనే నిజాన్ని వెలికి తీసేందుకు ఒక పండితుల కమిటీ వేసింది టీటీడీ. ఈ కమిటీ కొన్ని ఆధారాలను సేకరించినట్టు చెబుతున్నారు టీటీడీ ఈవో జవహార్ రెడ్డి. ఏప్రిల్ 21న శ్రీరామ నవమి నాడు.. ఈ ఆధారాలను బయట పెడతామని అంటున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు.
కొన్ని పురాణాలను అనుసరించి, మరికొన్ని గ్రాంధాలను బట్టీ.. ఆంజనేయుడు పుట్టింది అంజనాద్రిలోనే అని తేల్చి చెప్పనుంది ఈ పండిత బృందం. ఇక నుంచి ఆంజనేయుడి జన్మస్థలం తిరుమలలోని అంజనాద్రే అని చెప్పడానికి సిద్ధపడ్డామంటున్నారు పండితులు. ఆంజనేయుడు పుట్టిన యుగం- తిథి- వార- నక్షత్రాలతో సహా ఆధారాలను సేకరించామంటున్నారు.. వీటిని ఈవోకు అందజేశామనీ.. ఈ విషయాన్ని శ్రీరామ నవమి పర్వదినం రోజున జ్యోతిష్య శాస్త్ర ప్రకారం.. శాసనాలు, పురాణాలు వంటి శాస్త్రీయ ఆధారాలతో నిరూపిస్తామనీ అంటున్నారు. అంతే కాదు ఈ విషయంపై ఒక సమగ్రమైన పుస్తకం సైతం తెచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామని అంటున్నారు టీటీడీ అధికారులు.