AP Governament : ప్రస్తుత కాలంలో వేడుక ఏదైనా కానీ అక్కడ సాధారణంగా కనిపించే విషయం ఒక్కటే అదే ఫ్లెక్సీ. పెళ్లి దగ్గర నుంచి చావు వరకు, పుట్టిరోజులకు, సినిమా రిలీజ్ లకు, ఫంక్షన్ లకు, రాజకీయాలకు ఇలా ఒక్కటేంటి అన్నీ చోట్ల ఫ్లెక్సీ లు వేయించడం పరిపాటిగా మారింది. ఈ ఫ్లెక్సీ ల వల్ల పర్యావరణానికి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నప్పటికి వీటి వినియోగం మాత్రం తగ్గడం లేదు. కాగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ నిషేధంపై జాతీయ హరిత ట్రిబ్యునల్ ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం నవంబరు 1వ తేదీ నుంచి రాష్ట్రంలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలను నిషేధిస్తూ నోటిఫికేషన్ జారీచేసింది. ప్లాస్టిక్ ఫ్లెక్సీల దిగుమతికి, ఉత్పత్తికి అనుమతి లేదని స్పష్టం చేసింది. ఫ్లెక్సీల వినియోగం, ప్రదర్శన, ముద్రణ, రవాణా వంటివాటిపై నిషేధం విధించింది.
గ్రామీణ ప్రాంతాల్లో ఫ్లెక్సీలు వాడకుండా చూడాల్సిన బాధ్యతను కలెక్టర్లపై ఉంచింది ప్రభుత్వం. నిబంధనను అతిక్రమించి ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తే 100 జరిమానా విధించనున్నారు. ప్రభుత్వ ఉత్తర్వులు అతిక్రమించిన వారిపై చట్టప్రకారం చర్యలు కూడా తీసుకోనున్నారు. ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ ను ఇప్పటికే పూర్తిస్థాయిలో నిషేధించాలని, మాంసం దుకాణాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ప్లాస్టిక్ కవర్ల వినియోగించరాదని హెచ్చరించారు. ఇకపై క్రమం తప్పకుండా తనిఖీలు చేస్తామని నిబంధనలు పాటించకున్నా, ప్లాస్టిక్ వినియోగిస్తే భారీగా జరిమానా విధించడంతో పాటు, దుకాణాలను సీజ్ చేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఈ పరిస్థితుల్లో లక్షల రూపాయలు బ్యాంకు రుణాలు తీసుకుని ఫ్లెక్సీ ప్రింటింగ్ సంస్తలను ఏర్పాటు చేసుకున్న వ్యాపారస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫ్లెక్సీ ప్రింటింగ్ రంగంలో పనిచేస్తున్న టెక్నీషియన్లు, డిటిపి ఆపరేటర్లు, వర్కర్లు ఉపాధి లేక రోడ్డున పడతారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు కాన్వాస్‌లు, గోడలపై ప్రకటనలు రాసే కార్మికులు ఫ్లెక్సీలపై నిషేధంతో తిరిగి తమకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత 15 ఏళ్లుగా ప్లాస్టిక్ ఫ్లెక్సీ ల వల్ల ఉపాధి కోల్పోయిన తమకు సీఎం వైయస్ జగన్ తీసుకున్న నిర్ణయంతో మళ్ళీ ఉపాధి దొరుకుతుందని చెబుతున్నారు.