Ap Highcourt : ఇటీవల గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో ఇళ్ల కూల్చివేత ఘటన జరిగిన విషయం తెలిసిందే. ఈ విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తెదేపా నేత నారా లోకేష్ ఆ గ్రామాల్లో పర్యటించి బాధితులను పరామర్శించారు. ఈ క్రమంలో బాధిత రైతులు హైకోర్టును కూడా ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ కేసు విషయంలో 14 మంది రైతులు పిటీషన్లను దాఖలు చేయగా… వారందరికీ ఏపీ హైకోర్టు ఊహించని షాక్ ఇచ్చింది.
ఈరోజు హైకోర్టులో ఇప్పటంలో కూల్చివేతల కేసు ఘటన గురించి విచారణ జరగగా… హైకోర్టు పిటిషనర్లపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టును పక్కదారి పట్టించారంటూ ఈ సందర్భంగా ఇప్పటం పిటిషనర్లకు జరిమానా విధించింది. ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున 14 మందికి జరిమానా విధిస్తూ ఉత్తర్వులు చేసింది. ఆక్రమణల కూల్చివేతలకు ముందే నోటీసులు ఇచ్చినా ఇవ్వలేదంటూ పిటిషనర్లు కోర్టును తప్పుదోవ పట్టించారని ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది.
ఇళ్ల కూల్చివేతల విషయంలో ప్రభుత్వం తమకు నోటీసులు ఇవ్వలేదంటూ పిటీషనర్లు హైకోర్టుకు వివరించారు. అయితే తాము నోటీసులు ఇచ్చిన తర్వాతే కూల్చివేసినట్లు ప్రభుత్వ తరపు న్యాయవాది ధర్మాసనానికి వివరించారు. దీంతో హైకోర్టు పిటీషనర్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టును పక్కదారి పట్టించారని ఈ సందర్భంగా ధర్మాసనం మండి పడింది. ఆక్రమణల కూల్చివేతలకు ముందే నోటీసులు ఇచ్చినా ఇవ్వలేదంటూ కోర్టును తప్పుదోవ పట్టించారని పేర్కొంది. నోటీసులు ఇచ్చారని రుజువు కావడంతో హైకోర్టు వారికి జరిమానా విధించడంతో పాటు పిటీషన్‌ను కొట్టి వేసింది. ప్రస్తుతం ఈ వార్త రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.