కొన్ని సినిమాలు ఇలా వచ్చి అలా వెళ్లి పోతాయి. కానీ, కొన్ని సినిమాలు మాత్రం సుదీర్ఘకాలం, ఇంకా చెప్పాలంటే ప్రేక్షకుల మనసుల్లో ఎప్పటికీ నిలిచిపోతాయి. ఎన్నిసార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది. అందుకు కొత్త రీతిలో సాగే ఆ సినిమా కథ, నటీనటుల విభిన్నమైన అభినయం, దర్శకుడు సినిమాని రూపొందించిన తీరు, సరికొత్త అనుభూతిని కలిగించే పాత్రలు, అద్భుతమైన సాంకేతిక నైపుణ్యం… ఇలా అన్ని అంశాలూ కలసి వస్తాయి. అలాంటి సినిమాల్లో ఒకటి ‘అవతార్’.
ప్రపంచవ్యాప్తంగా 2009లో విడుదలైన ఈ చిత్రరాజం ఆరోజుల్లోనే ప్రపంచంలో అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా చరిత్ర సృష్టించింది. అందుకే, భాషతో, ప్రాంతంతో, దేశంతో సంబంధం లేకండా ‘అవతార్’ని సినీ ప్రియులు ఎప్పటికీ మరచిపోలేరు. రొటీన్ సినిమాలతో విసిగి వేసారిపోయిన ప్రేక్షకులకు ‘అవతార్’ ఎడారిలో ఒయాసిస్సులా తగిలింది. దర్శకుడు జేమ్స్ కామెరాన్ ఈ చిత్రం కోసం కొత్తదనానికి ప్రాణం పోశారు. అయితే, ‘అవతార్’ ఎప్పటికీ ముగిసిన అధ్యాయం కాదని నిరూపితమైంది.
చాలా కాలం తర్వాత మరోసారి కొత్త రూపంలో అవతార్ 2 – ద వే ఆఫ్ వాటర్స్ గా సెప్టెంబర్ 23వ తేదీన విడుదల చేయగా, ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. 4కె హెచ్.డి.ఆర్. రూపంలో వచ్చిన ఈ సినిమాను ప్రేక్షకులు ఈ విడత కూడా పెద్ద ఎత్తున ఆదరిస్తున్నారు. ఉత్తర అమెరికాలో 10 మిలియన్ డాలర్లు, అంతర్జాతీయంగా 20.5 మిలియన్ డాలర్లను మొదటి మూడు రోజుల్లోనే వసూలు చేసింది. అంటే మన కరెన్సీలో సుమారు రూ.244 కోట్లు. తాజా కలెక్షన్లు కూడా కలిపి చూస్తే అవతార్ మొత్తం వసూళ్లు 2.85 బిలియన్ డాలర్లవుతుంది. అంటే రూ.22,000 కోట్లన్నమాట…! బాప్ రే… అందుకే, ‘అవతార’మా మజాకా అనేక తప్పదు సుమండీ…!!