గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’ చిత్రం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని బాక్సాఫీస్ కా షేర్ గా నిలిచింది. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా శ్రీలీల కీలక పాత్ర పోషించిన ఈ చిత్రం, ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్ లో దసరా కానుకగా అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలై అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి, అభిమానులు, ప్రేక్షకులు, విమర్శకులందరి ప్రశంసలు అందుకొని అఖండ విజయం సాధించింది. ‘భగవంత్ కేసరి’ రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న నేపధ్యంలో చిత్ర యూనిట్ గ్రాండ్ బాక్సాఫీస్ కా షేర్ సెలబ్రేషన్ ని నిర్వహించారు. దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు ఈ వేడుకల్లో ముఖ్యఅతిధిగా పాల్గొని చిత్ర బృందానికి షీల్డ్స్ అందించారు. ఈ వేడుకలో అంబికా కృష్ణ ఆత్మీయ అతిధిగా పాల్గొన్నారు.
భగవంత్ కేసరి బాక్సాఫీస్ కా షేర్ సెలబ్రేషన్స్ లో నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. ఒక మంచి చిత్రానికి ప్రేక్షకులు నీరాజనాలు పట్టడానికి మించిన సంపాదన, సంతోషం జీవితంలో మరేది లేదన్నది ఎన్నో సందర్భాల్లో నేను అనుభవించాను. సమరసింహారెడ్డి, నరసింహానాయుడు, లారీ డ్రైవర్, మంగమ్మగారి మనవడు, ముద్దుల కృష్ణయ్య, ముద్దలా మావయ్య, భైరవద్వీపం, ఆదిత్య 369, లెజెండ్, సింహ, అఖండ, వీరసింహారెడ్డి.. ఇవాళ భగవంత్ కేసరి.. ఇలా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసే అదృష్టం దొరికింది. మూడు తరాల ప్రేక్షకులు మెచ్చుకుంటున్నారు, అభినందిస్తున్నారంటే అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ప్రయోగాత్మక సినిమాలు, వైవిధ్యభరిత పాత్రల్లో నటిస్తే ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారనే నమ్మకం నాన్నగారి నుంచి నాకొచ్చింది. మంచి కథలను పరిచయం చేస్తే విజయం తప్పక వరిస్తుందనడానికి ‘భగవంత్ కేసరి’ ఓ నిదర్శనం.
నా సినిమాలతో నా సినిమాలకే పోటీ.‘అఖండ’, ‘వీరసింహారెడ్డి’, ‘భగవంత్ కేసరి’లాంటి సినిమాలన్నీ నాకు సవాలుతో కూడుకున్నవే. ఈ కథలోని పాత్రల్లో ప్రవేశించడానికి అందరం చాలా కష్టపడ్డాం. అలాగే సాంకేతిక నిపుణులు అంతా ఎంతో శ్రమించారు. మా కష్టానికి ఫలితంగా ప్రేక్షకులు అద్భుతమైన విజయాన్ని ఇచ్చారు. తెర వెనుక వుండి ఈ చిత్రాన్ని ఘన విజయం చేసిన అందరినీ సత్కరించుకోవడానికి ఈ వేడుక జరపడం జరిగింది. ఈ వేడుకలో నాన్నగారితోనూ ఎన్నో సినిమాలు తెరకెక్కించిన దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు గారు పాల్గోవడం కార్యక్రమానికి ఒక నిండుతనాన్ని తీసుకొచ్చింది. దర్శకరత్న దాసరి గారు కూడా ఈ వేడుకలో వుంటే బావుండేది. ఆయన ఇండస్ట్రీకి పెద్దదిక్కులా వుండేవారు. ఈ సందర్భంగా వారిని స్మరించుకుంటున్నాను.
నా చిత్రాల్లో షడ్రుచులు వుండాలి. దర్శకుడు అనిల్ రావిపూడి ఈ కథ చెప్పినపుడు ఖచ్చితంగా సినిమా చేయాలని నిర్ణయించుకున్నాం. ఒక మంచి సందేశం చెప్పాలంటే సినిమానే గొప్ప మాధ్యమం. ఇది భాద్యతగా భావించి వెంటనే ఈ కథని ఒప్పుకోవడం జరిగింది. ఈ పాత్ర చిరస్థాయిగా నిలిచిపోతుంది. కాజల్, శ్రీలీల .. ఇలా అందరూ అద్భుతంగా నటించారు. అర్జున్ రామ్ పాల్ చాలా కసిగా ఈ పాత్ర చేశారు. ఆయనే స్వయంగా డబ్బింగ్ చెప్పడం అభినందనీయం. శరత్ కుమార్ గారు చేసింది చిన్న పాత్రే అయినా సినిమాకి ఒక శుభారంభం దొరికింది. నిర్మాతలు హరీష్ సాహు చక్కని చిత్రాలు నిర్మిస్తూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచుకున్నారు. వారు మరిన్ని గొప్ప సినిమాకు చేయాలి. తమన్ అద్భుతమైన సంగీతం అందించాడు. డీవోపీ రామ్ ప్రసాద్, లిరిక్ రైటర్స్ రామజోగయ్య శాస్త్రి, కాసర్లశ్యామ్,అనంత్ శ్రీరాం, ఫైట్ మాస్టర్స్ ఇలా అందరూ అద్భుతంగా పని చేశారు.
ఇది సమిష్టి కృషి. దర్శకుడు అనిల్ చాలా ప్రతిభావంతుడు. నటీ నటులు నుంచి నటనని చక్కగా రాబట్టుకోవడం తెలిసిన దర్శకుడు. తనకి గొప్ప భవిష్యత్ వుండాలని ఆశీర్వదిస్తున్నాను. ముందుముందు ఎన్నో సినిమాలు వస్తాయి. బాబీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాను. అందులో బ్లడ్ బాత్ బ్రాండ్ ఎలా ఉండబోతుందో చూస్తారు. ఇలా మంచి సినిమాలు చేసుకుంటూ, క్యాన్సర్ హాస్పిటల్ చైర్మెన్ గా, హిందూపూర్ ఎమ్మెల్యేగా నా వంతు సేవలు అందిస్తూ కృషి చేస్తూ జీవితం బాగా సాగాలని, ప్రేక్షకులంతా బావుండాలని కోరుకుంటూ, ఇంత మంచి విజయాన్ని చలన చిత్ర పరిశ్రమకు అందించిన అందరికీ ధన్యవాదాలు. డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబ్యూటర్స్.. అందరూ ఆనందంగా వున్నారు. ‘భగవంత్ కేసరి’ త్వరలో హిందీలో రాబోతుంది . హిందీలో కూడా మొట్టమొదటి సారి డబ్బింగ్ చెప్పాను. త్వరలో విడుదల కాబోతుంది. హిందీపై తెలుగు వారికి వున్న భాష పటిమ, సత్తా ఏమిటో ఈ చిత్రం తప్పకుండా నిరూపిస్తుంది. అందులో సందేహమే లేదు. ఇంత ఘన విజయం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు’ తెలిపారు.