మాటే ఒక తూటా.. జనామోదమే ఆయుధం , బహిరంగ సభే బహిరంగ సవాల్ , ప్రజాసందేశమే.. ప్రబల సంకేతం…
జాతీయ పార్టీగా మారిన తర్వాత బీఆర్‌ఎస్ తొలికేక ఖమ్మం గుమ్మంలో ప్రతిధ్వనించనున్నది. రైతు అభ్యున్నతే నాదంగా.. జై కిసాన్ నినాదంగా జాతీయ జెండా ఎత్తిన బీఆర్‌ఎస్ దశాబ్దాలుగా రైతు చేతనకు ఆలవాలంగా నిలిచిన ఖమ్మంలో తన వాణిని ప్రతిధ్వనించనున్నది. రైతన్నల పండుగైన సంక్రాంతి ‘క్రాంతి’ ఖమ్మంలో విరజిల్లనున్నది.
ఈ నెల 18న బుధవారం ఖమ్మంలో బీఆర్‌ఎస్ భారీ బహిరంగసభ నిర్వహించనున్నది. బీఆర్‌ఎస్‌గా మారిన తర్వాత పార్టీ నిర్వహిస్తున్న తొలి సభ ఇది. రాబోయే కాలంలో జాతీయస్థాయిలో మారే రాజకీయ సమీకరణాలకు సంకేత ప్రాయంగా ఈ సభకు బీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు మరో ముగ్గురు ముఖ్యమంత్రులు కేజ్రీవాల్ (ఢిల్లీ), భగవంత్‌మాన్ (పంజాబ్), విజయన్ (కేరళ) హాజరుకానున్నారు. యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ కూడా ఈ సభలో ప్రధాన ఆకర్షణగా నిలువనున్నారు. బీఆర్‌ఎస్‌తో పాటు మరో 3 ప్రధాన పార్టీలు సమాజ్‌వాదీ, ఆప్, సీపీఎంల ఐక్యతతో బహిరంగసభా వేదిక ఆసక్తికరంగా మారనున్నది.
భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) జాతీయ రాజకీయాల్లో తన ప్రస్థానం మొదలు పెట్టేందుకు ముహూర్తం ఖరారైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినట్టుగానే సంక్రాంతి తర్వాత ధూమ్‌ధామ్ మొదలు కానున్నది. రైతు, రాజకీయ చైతన్య గడ్డ ఖమ్మంలో ఈ నెల 18న భారీ బహిరంగ సభ ద్వారా బీఆర్‌ఎస్ శంఖారావం పూరించనున్నది. టీఆర్‌ఎస్ పార్టీ బీఆర్‌ఎస్‌గా మారిన తర్వాత నిర్వహిస్తున్న తొలి బహిరంగ సభ ఇదే. తెలంగాణ ఉద్యమానికి, టీఆర్‌ఎస్ పార్టీకి బలమైన అండగా నిలిచిన బహిరంగ సభల మాదిరిగానే బీఆర్‌ఎస్ కూడా బహిరంగ సభ ద్వారానే జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని పార్టీ అధిష్ఠానం భావిస్తున్నది. పార్టీ సత్తా చాటేలా ఈ సభను నిర్వహించేందుకు ప్రణాళిక రచిస్తున్నట్టు తెలిసింది. సభకు పలు రాష్ర్టాల ముఖ్యమంత్రులతోపాటు జాతీయస్థాయి నేతలను రానున్నట్టు బీఆర్‌ఎస్ వర్గాలు తెలిపారు.
విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్‌మాన్, కేరళ సీఎం పినరాయి విజయన్, యూపీ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఈ సభకు రానున్నారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లటంపై ఇప్పటికే రాష్ట్ర ప్రజల ఆశీర్వాదం కోరిన సీఎం కేసీఆర్, ఈ సభ ద్వారా దేశ రైతాంగానికి, రాజకీయ పక్షాలకు స్పష్టమైన సందేశం ఇవ్వాలని భావిస్తున్నట్టు సమాచారం. బీఆర్‌ఎస్ ద్వారా దేశ వ్యవసాయరంగంలో తీసుకొచ్చే మార్పులపై ఈ సభ ద్వారా వివరించనున్నట్టు తెలిసింది.
పార్టీలను కాదు ప్రజలను గెలిపించాలంటూ ‘అబ్‌కీ బార్.. కిసాన్ సర్కార్’ నినాదంతో జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు కేసీఆర్.. బీఆర్‌ఎస్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. అక్టోబర్ 10న దసరా రోజున టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చుతున్నట్టు ప్రకటించారు. అదేరోజు పార్టీ పేరును మార్చాలని కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ కూడా రాశారు. ఈసీ డిసెంబర్ 8ప బీఆర్‌ఎస్‌కు ఆమోదం తెలుపుతూ రాజముద్ర వేసింది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 9వ తేదీన సీఎం కేసీఆర్ అధ్యక్షతన బీఆర్‌ఎస్ ఆవిర్భావ సమావేశం జరిగింది. ఢిల్లీలోనూ బీఆర్‌ఎస్‌కు ప్రత్యేకంగా పార్టీ కార్యాలయాన్ని డిసెంబర్ 14వ తేదీన బీఆర్‌ఎస్ జెండా ఆవిష్కరించి ప్రారంభించారు.
భారీ సభతో దేశానికి సందేశం
టీఆర్‌ఎస్‌కు, బహిరంగ సభలకు అవినాభావ సంబంధం ఉన్నది. తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపడంలో, టీఆర్‌ఎస్‌ను ప్రజలకు చేరువ చేయడంలో పార్టీ నిర్వహించిన పలు సభలు కీలక పాత్ర పోషించాయి. మరీ ముఖ్యంగా 2001 ఏప్రిల్ 27న టీఆర్‌ఎస్ ఆవిర్భావం అనంతరం మే 17న కరీంనగర్‌లో నిర్వహించిన సింహగర్జన సభ, 2003లో వరంగల్‌లో నిర్వహించిన సభ తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదాయి. బహిరంగ సభలను కేసీఆర్ బలప్రదర్శనకు కాకుండా తన సందేశాన్ని ప్రజలకు బలంగా వినిపించేందుకు వేదికగా చేసుకుంటారు. ఇప్పుడు ఖమ్మంలో నిర్వహించే సభను కూడా సీఎం కేసీఆర్ అదే తరహాలో వినియోగించుకోనున్నారు.
జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశం, రైతు సంక్షేమం, బీఆర్‌ఎస్ ఏర్పాటు ఆవశ్యకతపై ప్రజలకు, యావత్ దేశానికి తన సందేశాన్ని ఇవ్వనున్నారు. ఖమ్మం జిల్లా ఏపీకి సరిహద్దుగా ఉండటం కూడా సభ కోసం ఈ జిల్లాను ఎంచుకోవడానికి కారణమని పార్టీ వర్గాలు తెలిపాయి. ఆ జిల్లాలో సభ ద్వారా ఏపీ ప్రజలకు కూడా సీఎం కేసీఆర్ తన సందేశాన్ని వినిపించనున్నారు. బీఆర్‌ఎస్ పార్టీ ఆవశ్యకత, రైతులకు చేయబోయే కార్యక్రమాల ఎజెండాను రైతుల ఎదుట వెల్లడించే అవకాశం ఉన్నది. ఇప్పటికే ఏపీలో బీఆర్‌ఎస్‌కు అనూహ్య ఆదరణ లభిస్తున్నది. కనుమూరి బాపిరాజు వంటి సీనియర్ నేతలు ఏపీలోకి బీఆర్‌ఎస్‌ను ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే రావెల కిశోర్‌బాబు వంటి చాలామంది సీనియర్ నేతలు బీఆర్‌ఎస్‌లో చేరగా, మరికొందరు చేరేందుకు సంసిద్ధులై ఉన్నారు. బీఆర్‌ఎస్ ఏపీ అధ్యక్షునిగా తోట చంద్రశేఖర్‌ను సీఎం కేసీఆర్ నియమించిన విషయం తెలిసిందే.
విపక్షాల ఐక్యత చాటేలా
జాతీయ స్థాయిలో బీఆర్‌ఎస్ సత్తా చాటేలా, విపక్షాల ఐక్యతను తెలిపేలా ఖమ్మం సభను భారీ స్థాయిలో నిర్వహించేందుకు బీఆర్‌ఎస్ నేతలు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిసింది. అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, పినరాయి విజయన్, అఖిలేశ్ యాదవ్‌తోపాటు మరికొందరు జాతీయ నేతలు ఈ సభకు రానున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే వారిని ఆహ్వానించటం, అందుకు వారు అంగీకారం కూడా తెలిపినట్టు సమాచారం. బీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావ సభలో, ఢిల్లీలో పార్టీ ఆఫీసు ప్రారంభోత్సవంలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ మరికొందరు జాతీయస్థాయి నేతలు పాల్గొన్నారు.