తెలంగాణ జాతిపిత , బి ఆర్ ఎస్ అధినేత , గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరో సంచలన నిర్ణయంతో అసెంబ్లీ ఎన్నికల శంఖారావం పూరించారు. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ ఒకేసారి 115 స్థానాలకు ముందుగానే బి ఆర్ ఎస్ అభ్యర్థులను ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్ కేసీఆర్ గారు మాత్రమే అనే విషయం అందరికీ తెలుసు.
2001 నుండి ఇప్పటి వరకు అది ఉద్యమమైనా , సంక్షేమమైనా , అభివృద్ధి అయినా కర్త , కర్మ , క్రియ అన్నీ తానై తెలంగాణను దేశంలో గెలిపించి నిరూపించిన నాయకుడు కేసీఆర్ గారు. ఆయన ఏం చేసినా ఒక కమిట్ మెంట్ తో , ఒక వ్యూహం తో , ఒక పద్ధతి ప్రకారం , జాగ్రత్తగా , నిదానంగా ముందుకు వెళతారు. నిర్ణయం తీసుకునే వరకు ఆలోచిస్తారు. ఒకసారి నిర్ణయం తీసుకున్న తరువాత వెనుకడుగు వేయడం ఆయనకు అలవాటు లేదు. అలా ఆయన తన రాజకీయ జీవితంలో ఎన్నో సంచలనాలను నమోదు చేశారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయమూ రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యానికి గురి చేసేది . అలాగే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా. 2014 లో మొట్ట మొదటి సారి ఒంటరిగా ఎన్నికలకు వెళ్లి 63 స్థానాలను సాధించి సంచలన విజయాన్ని నమోదు చేశారు . 2018 లో మొదటి సారి కంటే 25 స్థానాలు అధికంగా 88 స్థానాలు గెలిచి మరో చరిత్రను సృష్టించారు. ఆ భారీ విజయాలకు అన్నింటికీ కేసీఆర్ ఛరిష్మానే కారణమని అందరూ ఒప్పుకుంటారు. ఈ సారి 95 నుండి 105 స్థానాల విజయం లక్ష్యంగా వ్యూహ రచన చేస్తున్నారు .
తెలంగాణ ఉద్యమం మొదలైనప్పటి నుండి స్వరాష్ట్ర సాధన అంతిమ విజయాన్ని ముద్దాడే వరకు అన్నింటికీ దాదాపుగా ఆయన వ్యూహాలు , ఎత్తుగడలు , పని తీరే కారణమని అందరికీ తెలుసు . తెలంగాణ ప్రభుత్వంలోనూ ప్రతి సంక్షేమ పథకం రూపకల్పన కు , అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన ఆలోచనలు , సంకల్ప బలమే కీలక భూమికను పోషించాయి. 24 గంటల విద్యుత్తు , కాళేశ్వరం ప్రాజెక్టు , అనేక సంక్షేమ పథకాలు , నూతన జిల్లాల ఏర్పాటు , ధరణి వంటి గొప్ప రెవెన్యూ సంస్కరణలు ఎన్నో ఆయన పరిపాలనా దక్షతకు , ముందు చూపుకు అద్దం పడతాయి .
రెండు విడతలు ముఖ్యమంత్రిగా పని చేసిన అనుభవంతో ఈ సారి ప్రతి పక్షాలను మట్టి కరిపించడానికి ఆయన వ్యూహ రచన చేస్తున్నారు. తెలంగాణ రాకముందు పరిస్థితులు ఎలా ఉండేవో , తెలంగాణ వచ్చి కేసీఆర్ గారు ప్రగతి రథసారధిగా నిలిచిన తర్వాత ఇప్పుడు తెలంగాణ ఎలా ఉందో తెలంగాణ ప్రజలకు అందరికీ తెలుసు . అప్పటి కష్టాలు , ఇప్పటి సంతోషానికి మధ్య ఉన్న తేడాను ప్రజలు చాలా స్పష్టంగా గమనిస్తూనే ఉన్నారు. ఇంకా మ్యానిఫెస్టో రావాల్సి ఉంది . కేసీఆర్ గారి మదిలో ఇంకెన్ని ఆలోచనలు ఉన్నాయో ఎవరికీ తెలియదు. కేసీఆర్ గారి 115 మంది అభ్యర్థుల ప్రకటనకే ప్రతిపక్ష పార్టీలు గిల గిలా కొట్టుకుంటున్నాయి . మంత్రి కేటీఆర్ గారు చెప్పినట్లు అసలు సినిమా ఇంకా ముందుంది.