Cable Bridge Collapse : గుజరాత్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మోర్బీ పట్టణంలో మచ్చు నదిపై ఉన్న కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటన ఒక్కసారిగా దేశవ్యాప్తంగా షాక్ కు గురిచేసింది. బ్రిటిష్ కాలం నాటి ఈ వంతెనకు వారం రోజుల క్రితమే మరమ్మతులు పూర్తి చేశారు. ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకోగా… బ్రిడ్జి కూలిన సమయంలో సుమారు 500 మంది బ్రిడ్జిపై ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనలో పలువురు ప్రాణాలతో బయటపడగా… ఆసుపత్రి వర్గాల సమాచారం ప్రకారం ఇప్పటి వరకు 137 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుల్లో అధికంగా మహిళలు, చిన్నారులు ఉన్నట్లు గుర్తించారు.
మోర్బిలోని కేబుల్ బ్రిడ్జి దాదాపు 150 సంవత్సరాల పురాతనమైనది. ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. ఏడు నెలల పాటు దానిని మూసివేసి ఉంచారు. మరమ్మతుల అనంతరం గుజరాతీ నూతన సంవత్సరమైన అక్టోబర్ 26న ప్రజలకు తిరిగి అందుబాటులోకి తెచ్చారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ఎన్‌డిఆర్‌ఎఫ్‌కు చెందిన ఐదు బృందాలు సంఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. సైన్యం, నౌకాదళం, వైమానిక దళం కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. అర్థరాత్రి వరకు సహాయక చర్యలు కొనసాగగా, వెలుతురు లేకపోవడంతో కొంత ఆటంకం ఏర్పడింది. ఈరోజు తెల్లవారు జాము నుంచి సహాయక చర్యలను ముమ్మరం చేశారు. అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు.
మరోవైపు ఈ ఘటనపై విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. ఈ బ్రిడ్జిని ప్రారంభించేందుకు కంపెనీకి ఫిట్‌నెస్ సర్టిఫికేట్ జారీ చేయబడిందా లేదా అనేది తెలియాల్సి ఉంది. వంతెన మరమ్మతులు చేపట్టిన కంపెనీపై ఐపీసీ సెక్షన్ 304, 308 మరియు 114 కింద కేసులు నమోదు చేసినట్లు గుజరాత్ హోం మంత్రి తెలిపారు.