సాధారణంగా పెద్ద స్థాయిలో వున్న రాజకీయ నాయకులు బయటికి వస్తే చాలు, చుట్టూ బాడీ గార్డులుండడాన్ని మనం గమనిస్తూంటాం. మరికొన్ని సందర్భాల్లో తమకు ఇతరుల నుండి ప్రాణహాని వుందని ప్రముఖులు అర్థిస్తే సాధ్యాసాధ్యాలను పరిశీలించి వారికి అవసరమైన భద్రతను కల్పిస్తారు. కానీ, తోపుడు బండిపై బట్టలమ్ముకునే వ్యక్తికి ఇద్దరు బాడీ చేతుల్లో తుపాకులతో రక్షణగా వున్నారంటే నమ్మగలమా? కానీ, ఇది నిజంగా నిజం. ఈ ఆసక్తికరమైన విషయమేంటో ఇప్పుడు చూద్దాం.
ఉత్తరప్రదేశ్ లోని ఎటా జిల్లాకు చెందిన రామేశ్వర్ దయాళ్ తోపుడి బండిపై బట్టలమ్ముతూ రోజుకు సుమారు మూడొందల వరకూ సంపాదిస్తాడు. ఇటీవల ఎస్పీ నేత, మాజీ ఎమ్మెల్యే రామేశ్వర్ సింగ్ సోదరుడు, జిల్లా పంచాయతీ మాజీ అధ్యక్షుడైన జుగేంద్ర సింగ్ ను కలసి తన భూమికి పట్టా ఇప్పించమని కోరాడు రామేశ్వర్. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది. దీంతో తనను కులం పేరుతో దూషించారంటూ జుగేంద్ర, లేఖపాల్ రాంఖిలాడి, రామమూర్తి, రేఖలపై రామేశ్వర్ దయాళ్ ఈ నెల 3న పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
దీంతో జుగేంద్ర హైకోర్టును ఆశ్రయించారు. రామేశ్వర్ చేసిన ఆరోపణలు అవాస్తవమని, కేసును కొట్టివేయాలని కోరారు. దీంతో కోర్టుకు హాజరుకావాల్సిందిగా రామేశ్వర్ దయాళ్‌ను కోర్టు ఆదేశించింది. శనివారం ఆయన ఒంటరిగా రావడాన్ని గమనించి ఆశ్చర్యం వ్యక్తం చేసిన కోర్టు రక్షణ ఎందుకు కల్పించలేదని పోలీసులను ప్రశ్నించి వెంటనే ఇద్దరు బాడీగార్డులను నియమించాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో పోలీసులు రామేశ్వర్‌కు ఇద్దరు గార్డులను నియమించారు. వారిద్దరూ ఏకే 47 రైఫిళ్లతో రామేశ్వర్ దయాళ్ కు రక్షణగా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణ ఈ నెల 25న జరగనుంది.