CM Jagan : ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు రోజురోజుకి రసవత్తరంగా మారుతున్నాయి. 2024 ఎన్నికలే లక్ష్యంగా ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. వైకాపా అధినేత సీఎం జగన్, తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు తమ పార్టీల కార్యకర్తలను ఎన్నికలకు సన్నద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం ఇరు పార్టీల నేతలు వరుస సమీక్షలు నిర్వహిస్తూ పార్టీ కార్యకర్తలు, నేతల్లో నూతన ఉత్తేజం నింపుతున్నారు. కాగా ఈ మేరకు మరోసారి ఎన్నికల్లో గెలుపు కోసం సీఎం జగన్ తీవ్ర కసరత్తు చేస్తున్నారు. పార్టీ కార్యకర్తలతో వరుస సమావేశాలు, సమీక్షలు నిర్వహిస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాలకు 175 సీట్లు గెలవాలని వైసీపీ శ్రేణులతో అన్నారు సీఎం జగన్.
తాజాగా విశాఖపట్నం నార్త్ నియోజకవర్గ కార్యకర్తలతో సీఎం జగన్ సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో జగన్ మాట్లాడుతూ… మనం అనుకున్న లక్ష్యం ఎందుకు సాధ్యం కాదో మనల్ని మనం ప్రశ్నించుకోవాలని కార్యకర్తలకు సూచించారు. చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చక్కని పాలన జరుగుతోందన్నారు సీఎ జగన్. కుప్పం లాంటి నియోజకవర్గంలో కూడా స్థానిక ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేశామని అన్నారు జగన్.
గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని, సంక్షేమ పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు సూచించారు జగన్. అందులో కార్యకర్తల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని జగన్ చెప్పారు. మరో 16 నెలల్లో ఎన్నికలు వస్తున్నాయని… కార్యకర్తలు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని… సమయం ఉంది కదా అని కార్యకర్తలు ఉదాసీన వైఖరి కనబర్చరాదని హెచ్చరించారు. రాష్ట్రంలో 175కి 175 సీట్లు ఎందుకు గెలవలేం అనే లక్ష్యంతో ముందుకు వెళ్లాలని దిశ నిర్దేశం చేశారు. ఈసారి ఎన్నికల్లో గెలిస్తే మరో 30 ఏళ్లు మనమే అధికారంలో ఉంటామని జగన్ అభిప్రాయపడ్డారు.