Rahul Gandhi : కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతోంది. తమిళనాడులోని కన్యాకుమారి నుంచి సెప్టెంబర్ 7వ తేదీన ప్రారంభమైన భారత్ జోడో యాత్ర 53 రోజులుగా కొనసాగుతూ వస్తోంది. ఇప్పటికే తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లో భారత్ జోడో యాత్ర పూర్తిచేసిన రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటిస్తున్నారు. అన్ని వర్గాల ప్రజల సమస్యలు తెలుసుకుంటూ.. ప్రజలతో మమేకమవుతూ రాహుల్ గాంధీ ముందుకు సాగుతున్నారు.
తన పాదయాత్ర మార్గంతో పాటు… పాదయాత్ర ముగిసిన తర్వాత కూడా ప్రజలతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకుని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. పాదయాత్రలో భాగంగా భారతీయ జనతా పార్టీ ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతోందని, తెలంగాణ రాష్ట్ర సమితి ప్రజల సొమ్మును దోచుకుంటోందని విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా ఇటీవల రాహుల్ గాంధీ పాదయాత్ర జడ్చర్ల సమీపంలోని గొల్లపల్లిలో ముగిసింది. అక్కడే బస చేసిన రాహుల్ గాంధీ ఇవాళ అక్కడి నుంచే పాదయాత్రను తిరిగి ప్రారంభించారు.
ఇక పాదయాత్ర చేస్తూనే గొల్లపల్లిలో మహిళలతో కలిసి చప్పట్లు కొడుతూ బతుకమ్మ ఆడారు రాహుల్ గాంధీ. ఈ సమయంలో రాహుల్ గాంధీతో పాటు టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి, జయరాం రమేష్ తో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు సైతం బతుకమ్మ ఆడి ప్రజల్ని ఉత్సాహపరిచారు. తన పాదయాత్రలో భాగంగా రాహుల్ గాంధీ విద్యార్థులు, రైతులు, ప్రొఫెసర్లతో చర్చిస్తున్నారు. ఇవాళ ప్రజాస్వామ్యం, లౌకికవాదంపై ఆయన ప్రొఫెసర్లతో చర్చించనున్నారు. ప్రస్తుతం రాహుల్ బతుకమ్మ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.