Rajiv Gandhi : భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో నిందితులుగా ఉన్న నళిని, మరో ఐదుగురు వ్యక్తులను విడుదల చేస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ సంచలన నిర్ణయం పట్ల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 1991 మే 21 న తమిళనాడు లోని శ్రీ పెరంబుదూర్ లో ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజీవ్ గాంధీ వెళ్లిన సందర్భంలో… లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం(ఎల్టీటీఈ) ఉగ్రవాదులు జరిపిన ఆత్మహుతికి దాడిలో రాజీవ్ గాంధీ మరణించారు. ఈ హత్య కేసులో దోషులుగా ఉన్న నళినీ శ్రీహరన్ తో పాటు మరో ఐదుగురు దోషులను విడుదల చేయాలని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది.
రాజీవ్ గాంధీ హత్య కేసులో మొత్తం ఏడుగురు దోషులకు మరణశిక్ష విధించారు. అయితే 2000లో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు, రాజీవ్ గాంధీ భార్య సోనియాగాంధీ జోక్యంతో నళిని శ్రీహరన్ శిక్షను జీవిత ఖైదుకు తగ్గించారు. 2008లో రాజీవ్ కుమార్తె ప్రియాంకాగాంధీ తమిళనాడులోని వెల్లూరు జైలుతో నళినిని కలిశారు. 2014లో మరో ఆరుగురి శిక్షలను కూడా తగ్గించారు. అదే ఏడాది అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత వారిని విడిపించేందుకు చర్యలు తీసుకున్నారు. ఈ ఏడాది మే నెలలో దోషుల్లో ఒకరైన ఏజీ పెరారివాలన్ ను సుప్రీంకోర్టు విడుదల చేసింది. దీంతో తనతో పాటు ఇతరును కూడా విడుదల చేయాలని నళిని కోర్టును ఆశ్రయించారు.
కాగా గతంలో రాజీవ్ గాంధీ హంతకులను జైలు నుంచి విడుదల చేయాలని సోనియా గాంధీ కోరారు. అయితే ఆమె నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. సోనియా గాంధీ వ్యక్తిగత అభిప్రాయాన్ని పార్టీ అంగీకరించదని… కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వీ అన్నారు. రాజీవ్ గాంధీ హత్య సాధారణ నేరం కాదని… ఇది జాతీయ సమస్య అని అన్నారు.