Adah Sharma : ‘హార్ట్ ఎటాక్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన చిన్నది అదా శర్మ. ఈ ఏడాది విడుదలైన ‘ది కేరళ స్టోరీ’ చిత్రంతో దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. సుదీప్తో సేన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. బెంగాల్ రాష్ట్రంతో పాటు కొన్ని రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని నిషేదించినప్పటికి బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది. ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన అదా శర్మ సినిమాలకు కొంత కాలం విరామం ప్రకటించింది. చర్మ సంబంధిత సమస్యతో బాధపడుతుండడంతో ట్రీమ్‌మెంట్ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
సోషల్ మీడియా వేదికగా ఆమె ఈ విషయాన్ని తెలియజేసింది. దద్దుర్లు వచ్చాయని, శరీరం అంతటా వ్యాపించాయని చెప్పింది. దీని వల్ల కొన్ని రోజులుగా తాను అనారోగ్యంతో బాధపడుతున్నట్లు చెప్పింది. దద్దుర్లు కారణంగా స్లీవ్ లెస్ డ్రెసెస్స్ వేసుకోవడం లేదని, పుల్ స్లీవ్స్ ఉన్న బట్టలనే వేసుకుంటున్నట్లు తెలిపింది. ఒత్తిడి కారణంగా ముఖంపైన కూడా దద్దుర్లు వచ్చాయని, మందులు వేసుకోగా అవి అలర్జీకి దారి తీశాయంది. ఇప్పుడు తాను ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది.
ఇక తన ఆరోగ్యం విషయంలో జాగ్రత్త తీసుకుంటానని అమ్మకు మాటిచ్చినట్లు తెలిపింది. ‘రేడియో ట్రయల్స్, జూమ్ ఇంటర్వ్యూలు, ప్రోమో షూట్‌లకు బదులుగా ఆరోగ్యంపై దృష్టి పెట్టమని అమ్మ చెప్పింది. దీంతో అమ్మకు మాటఇచ్చాను. కొన్ని రోజుల పాటు ఆరోగ్యంపై ఫోకస్ పెడుతా. త్వరలోనే మీ అందర్నీ కలుస్తా.’ అని అని అదా శర్మ తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది. అంతేకాదు తన ఆరోగ్య సమస్యకు సంబంధించిన చిత్రాలను పంచుకుంది. దద్దుర్లను చూసి భయపడవద్దని చెప్పింది.